భారత్ లో త్వరలో కాగితపు కరెన్సీ ఉప సంహరణ దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తుంది. త్వరలో దేశంలో కాగితపు కరెన్సీ స్థానంలో పాలిమర్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ వర్గాలు వెల్లడించాయి. వీటిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా రూ.10, రూ.20 పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకురానున్నారు. వీటి చలామణి పురోగతి ఆధారంగా..దశల వారిగా 2027 నుంచి పూర్తిస్థాయిలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశ పెట్టాలని ఆర్‌బీఐ కసరత్తు చేస్తుంది. పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లు చలామణిలో కొనసాగుతుండగానే.. కొత్త పాలిమర్ నోట్లనూ దశలవారీగా ప్రవేశపెడుతారు. కాగితపు కరెన్సీతో పోలిస్తే పాలిమర్ కరెన్సీ నోట్లు ఎక్కువ మన్నికగా ఉంటాయని తెలుస్తుంది. నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం ఈ పాలిమర్ నోట్ల ముఖ్య ఉద్దేశం. ఇవి తడిని తట్టుకోగలవు. చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే పాలిమర్ నోట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ కొత్త తరహా కరెన్సీ నోట్లను ముద్రించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థమైన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్బీఐ నోట్ల ముద్రణా విభాగం గ్లోబల్ ఆసక్తి వ్యక్తీకరణను (EOI) జారీ చేసింది. ఆగస్టు 18 నాటికి బిడ్లు దాఖలు చేయాలని సూచించడంతో త్వరలోనే మార్కెట్ లోకి పాలిమర్ నోట్లు రావచ్చన్న వాదనలనకు బలం చేకూర్చింది.