Army Dog Tyson | మొదటి బుల్లెట్​ తనకే.. అయినా మోస్ట్​వాంటెడ్​ను పట్టించేంతవరకు తగ్గలేదు : శునక ‘సైనికుడు’ టైసన్ వీరగాథ

కిష్త్వార్‌లో 2 పారా స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్‌లో గాయపడినా వెనక్కి తగ్గని సైనిక శునకం టైసన్ ధైర్యం దేశాన్ని కదిలించింది. ముగ్గురు జైష్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించిన టైసన్​కు దేశం అభివందనం చేసింది.

Army Dog Tyson | మొదటి బుల్లెట్​ తనకే.. అయినా మోస్ట్​వాంటెడ్​ను పట్టించేంతవరకు తగ్గలేదు : శునక ‘సైనికుడు’ టైసన్ వీరగాథ

Army Dog Tyson Shot but Unstoppable: Leads 2 Para SF to Jaish Hideout in Kishtwar

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

Army Dog Tyson | జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ఒక శునకం చూపిన ధైర్యం దేశాన్ని కదిలించింది. 2 పారా (స్పెషల్ ఫోర్సెస్) యూనిట్‌కు చెందిన జర్మన్ షెఫర్డ్ ‘టైసన్’ తీవ్రంగా గాయపడినా ఆపరేషన్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు మంది జైష్ ఉగ్రవాదులు హతమయ్యారు.

కాలికి బుల్లెట్​ గాయం… అయినా వెరవని నైజం

చాత్రూ అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను ముందుగా గుర్తించినది టైసనే. దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియల మధ్య దాగి ఉన్న ఉగ్రవాదుల స్థావరం వైపు అది మెల్లగా నక్కినక్కి వెళ్లింది. దాన్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. టైసన్ కాలిలో బుల్లెట్​ దిగింది. అయినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగింది. జైష్​ మోస్ట్​ వాంటెడ్​ ఉగ్రవాది సైఫుల్లా ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించింది. దాని మార్గదర్శకత్వంలో సైనికులు దాడి చేసారు.

ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జైష్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో రెండేళ్లుగా భద్రతా బలగాలకు చిక్కకుండా తిరుగుతున్న సైఫుల్లా బలోచీ కూడా ఉన్నాడు. అతనిపై రూ.5 లక్షల బహుమతి ప్రకటించబడింది. 2024 జూలైలో 10 Rashtriya Rifles పై జరిగిన దాడికి అతనే నేతృత్వం వహించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 20 సార్లు ఎన్​కౌంటర్ల నుండి తప్పించుకున్నా, ఈసారి టైసన్​ వల్ల దొరికిపోయాడు.

టైసన్​ను హెలీకాప్టర్​లో ఆసుపత్రికి తరలింపు – ఆరోగ్యం నిలకడగానే..

1️⃣ కిష్త్వార్ ఆపరేషన్‌లో గాయపడిన భారత సైన్య శునకం టైసన్ – కాలి వద్ద బ్యాండేజ్‌తో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం

గాయపడిన వెంటనే టైసన్‌ను హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం టైసన్​ ఆరోగ్యం నిలకడగా ఉందని సైనిక వర్గాలు వెల్లడించాయి. టైసన్​ అంటే తమకు ఒక శునకం కాదనీ, సైనికుడని గర్వంగా ప్రకటించిన సైనికాధికారి, ఒక సైనికుడికి ఇచ్చే గౌరవం, చికిత్స.. టైసన్​కు కూడా వర్తిస్తాయని తెలిపారు.

ఆపరేషన్ స్థలంలో రెండు ఏకే–47 తుపాకులు, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు దీర్ఘకాలిక దాడులకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది. Jaish-e-Mohammed కు చెందిన ఈ మాడ్యూల్ కిష్త్వార్ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ఆపరేషన్‌ను 2 Para (Special Forces) విజయవంతంగా పూర్తి చేసింది.

ఆధునిక యుద్ధాల్లో శునకాల పాత్ర

ఆధునిక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో సైనిక శునకాలు కీలకంగా మారాయి. పేలుడు పదార్థాల గుర్తింపు నుంచి మాటున ఉన్న ఉగ్రవాదులను కనిపెట్టడం వరకు వీటి పాత్ర అత్యంత కీలకం. ప్రత్యేక దళాల్లో వీటికి ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సమీప పోరాట ప్రాంతాల్లో పనిచేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

టైసన్ కథ కేవలం గాయపడిన ఒక శునకం కథ కాదు. అది విధి పట్ల అంకితభావం, భయం కంటే దేశభక్తి గొప్పదని నిరూపించిన సైనికుడి గాథ. భారత సైన్యంలో గౌరవం హోదాను చూసి ఇవ్వరు. ధైర్యం, కార్యాచరణతో సాధించాలి.

ఆ ధైర్యంతోనే టైసన్ వెనక్కి తగ్గలేదు. దేశం అతనికి సెల్యూట్​ చేస్తోంది.