రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన “చలో సెక్రటేరియట్” ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులు, నాయకులు భారీగా సచివాలయం వైపు దూసుకువెళ్లడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను పోలీసులు అన్యాయంగా అడ్డుకుని, బలవంతంగా అరెస్టు చేశారని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పోలీసులు విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వామపక్ష విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయగా అనేక జిల్లాల నుండి పోలీసుల నిర్బంధాన్ని తప్పించుకొని పలువురు నాయకులు హైదరాబాద్ చేరుకొని చలో సచివాలయం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా… కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్(AISF రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి , దామెర కిరణ్, అశోక్ రెడ్డి SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు, పల్లె మురళి AIFDS రాష్ట్ర అధ్యక్షుడు, బోనగిరి మధుకర్ PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సన్నీ గౌడ్ AISB రాష్ట్ర నాయకుడు, ఆడేపు రవి కుమార్ AIPSU రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్ రాక చదువులకు దూరమవుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టులతో మా ఉద్యమాలను ఆపలేరు, వెంటనే రూ. 11 వేల కోట్ల బకాయిలన్నింటినీ ఏకకాలంలో విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.