తెలంగాణకు ఐఐఎం సాధించుకోవాలి

తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) తీసుకువచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని ఎంపీలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Edited by: విధాత తెలంగాణ డెస్క్ | Jul 13, 2026, 8:23 pm IST
Read Time: 5 mins
తెలంగాణకు ఐఐఎం సాధించుకోవాలి

హైలైట్స్:

  • బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ను తీసుకురావాలని, ఇందుకు బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని ఆయన కోరారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సోమవారం నిర్వహించిన తెలంగాణ పార్లమెంటు సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అన్నారు. దీనికి సంబంధించిన రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు.

కొలిక్కి వచ్చిన ట్రిపుల్‌ ఆర్‌ భూసేకరణ

ట్రిపుల్ ఆర్ భూసేకరణ ఒక కొలిక్కి వచ్చిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని పూర్తి చేసుకోవాల్సి ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేంద్రం నుంచి అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం అనుమతులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీలను కోరారు. కర్ణాటక రాష్ట్రంలో సాగునీటికి సంబంధించి తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించిన విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్వోసీ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. డిండి–30 టీఎంసీలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు–90 టీఎంసీలకు ఎన్వోసీ తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ అంశం చర్చల దశలో ఉందని, దీనిపై కేంద్రం కూడా చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కోరారు. 120 టీఎంసీలకు కేంద్రం అనుమతులు వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

గోదావరి, కావేరి అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం

గోదావరి, కావేరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. కేంద్రం సహకరిస్తే కేంద్రం సహకరించిందని మేం నిరభ్యంతరంగా చెబుతాం, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఒప్పుకునేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి, పోర్ట్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్ పోర్టులకు సంబంధించిన అనుమతులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా చూడాలని ఎంపీలను రేవంత్ రెడ్డి కోరారు.