హైలైట్స్:
- బీఆర్ఎస్ సొంత నిర్ణయాల వల్లే కూలిన కాళేశ్వరం
- ప్రజల సొమ్ము లూటీ చేసి, ఇరిగేషన్ ప్రాజెక్టులను వృథా చేశారు
- ఇంజినీర్లను పక్కనబెట్టి సొంత తెలివితేటలు వాడటం వల్లే మూడేళ్లకే కూలిపోయాయి
- తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లోకి ‘గోబెల్స్ ప్రచారం’ వదిలారు
- బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి తీవ్ర ఆగ్రహం
- అత్యవసర పనులకు రూ. 146 కోట్లు తక్షణ విడుదల
- దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన డిప్యూటీ సిఎం, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
విధాత ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిపుణులు, ఇంజనీర్ల సలహాలను తుంగలో తొక్కి, సొంత నిర్ణయాలతో ప్రాజెక్టులు కట్టడం వల్లే కాళేశ్వరం బ్యారేజీలు మూడేళ్లకే కూలిపోయాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. “ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును సంపూర్ణంగా లూటీ చేసింది, దోపిడీ చేసి వృథా చేసింది” అని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం జె.చొక్కారావు దేవాదుల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి ఇన్‌ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిపుణుల మాట విందామా? విపక్షాల గాలి మాటలు విందామా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ‘ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?’ అని నాటి బిఆర్ఎస్ పాలకులను నిలదీశారు. “బీఆర్ఎస్ హయాంలో జరిగిన నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సీడబ్ల్యూసీ (CWC) నిపుణులు స్వయంగా వచ్చి పరిశీలించి.. వీటిలో నీళ్లు నింపితే బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోతాయని, గేట్లు ఎత్తి ఉంచాలని హెచ్చరించారు. సాంకేతికంగా నిపుణులు వద్దు అంటుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ‘లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి’ అంటూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే మీరు ఈ రాష్ట్రానికి చాలా పాపాలు చేశారు.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు బంద్ చేయండి.” బ్యారేజీ సరిగ్గా లేకపోయినా నీళ్లు నింపుకోవచ్చంటూ రాష్ట్ర ప్రజల మధ్యలోకి ఒక తప్పుడు ప్రచారాన్ని, గోబెల్స్ ప్రచారాన్ని వదిలారని మండిపడ్డారు. సాంకేతికంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సీడబ్ల్యూసీ (CWC) అధికారులు ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని చెప్పారు. గేట్లు మూస్తే బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. సాంకేతిక నిపుణుల మాట విందామా? లేక ఇప్పటికే ప్రాజెక్టును ముంచేసిన వారి గాలి మాటలు విందామా?” అని ప్రశ్నించారు.
"గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, ఇంజినీర్ల మాటను కూడా లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకున్నారు. "మొత్తం నేనే రక్తాన్ని చెమటగా మార్చి, మెదడును రంగరించి, ఇంజనీర్లందరినీ పక్కన పెట్టేసి, నేనే కాళేశ్వరం కట్టా’’నని ఆనాడు కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు అనేకమార్లు చెప్పారు. అలా నాయకులు తమ సొంత తెలివితేటలతో కట్టడం వల్లే ఆ ప్రాజెక్టు ఇవాళ కూలిపోయింది. ఆ రోజే ఇంజినీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు కదా! ఒకసారి తప్పు చేసి, దేనికి పనికిరాకుండా చేసిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు."
- మల్లు భట్టి విక్రమార్క
నీటిని లిఫ్ట్ చేయాలంటే గేట్లు మూయాల్సిందే.. కానీ!
బ్యారేజీల నుంచి నీటిని పంప్ చేయాలంటే, కన్నెపల్లి పంపులకు లెవెల్ రావాలంటే మేడిగడ్డలో కనీసం 5 టీఎంసీలు, నీటిని నిల్వ చేయాలి. అన్నారంలో కనీసం 10 టీఎంసీలు,సుందిళ్లలో కనీసం 8 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రకంగా నీటిని నిల్వ ఉంచాలంటే బ్యారేజీ గేట్లు మూయాలి. కానీ, గేట్లు మూస్తే బ్యారేజీల పునాదులు దెబ్బతిని, అవి అడ్రస్ లేకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారని భట్టి పేర్కొన్నారు. అందుకే నిపుణుల మార్గదర్శకత్వంలో సంపూర్ణంగా మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లు ఎత్తి ఉంచుతామని, వరద నీరు కిందికి వెళ్లేలా చూస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రాజెక్టులు పదిలం.. బీఆర్ఎస్ వీ మూడేళ్లకే గుల్ల!
గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో నిర్మించిన ప్రాజెక్టుల భద్రతను భట్టి విక్రమార్క కొనియాడారు. “కాళేశ్వరం బ్యారేజీల కంటే ఎగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును గత కాంగ్రెస్ హయాంలో కట్టారు. అదే గోదావరి నది, కింద అదే ఇసుక పునాది.. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నా అది ఇప్పటికీ నిటారుగా, గట్టిగా నిలబడింది. ఆరు దశాబ్దాల క్రితం కట్టిన ఎస్ఆర్ఎస్పీ (SRSP) ప్రాజెక్ట్ కూడా గోదావరి ఉధృతికి చెక్కుచెదరలేదు. మరి బీఆర్ఎస్ కట్టిన బ్యారేజీలు మూడేళ్లకే ఎందుకు కుంగాయి? ఎందుకంటే వారు ఇంజనీర్లను పక్కనబెట్టి, రక్తాన్ని చెమటగా మార్చామంటూ సొంత తెలివితేటలతో కట్టారు కాబట్టే” అని ఎద్దేవా చేశారు.
దేవాదుల పనులకు రూ. 146 కోట్లు విడుదల
ఎలినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్ పనులను వేగవంతం చేసేందుకు రూ. 146 కోట్ల నిధులను ఆర్థిక శాఖ ద్వారా విడుదల చేశామన్నారు. భూసేకరణ రూ. 58 కోట్లు పెండింగ్ పనులు రూ. 74 కోట్లు, నిర్వహణ రూ. 14 కోట్లు, మొత్తం నిధులు రూ. 146 కోట్లు విడుదల చేశామన్నారు. సస్యశ్యామలమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న 10 పంపులను నిరంతరాయంగా నడుపుకుంటూ, దాదాపు 12 జిల్లాలకు, గోదావరి పరివాహక ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో దేవాదుల ప్రాజెక్టును ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడానికి ఎన్ని వేల కోట్లయినా కేటాయిస్తామన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు నీరందిస్తామని చెప్పారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కోసం ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టును చేపట్టి గోదావరి నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటామని, ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.