విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మండల కాంగ్రెస్ కమిటీల నియామకం చిచ్చు రేపుతుంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకం వ్యవహారం పార్టీలోని వర్గపోరును రచ్చకెక్కించింది. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, నాగార్జున సాగర్, కోదాడ, మునుగోడు, మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కమిటీలతో వర్గపోరు బహిర్గతమైంది.
పీసీసీ ముందుకు తుంగతుర్తి మండల కమిటీల పంచాయతీ
తుంగతుర్తి అసెంబ్లీ నియోజవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వర్గాల మధ్య మండల కాంగ్రెస్ కమిటీల నియామకం బాహాబాహికి సైతం దారి తీసింది. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల కమిటీలను రద్దు చేయాలని ఎంపీ చామల పీసీసీకి లేఖ రాశారు. దీంతో రెండు వర్గాల మధ్య ముదిరిన వర్గ పోరు పంచాయతీ పరిష్కార బాధ్యతలను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డికి అప్పగించారు.
నిన్న ఎంపీ చామల, సర్వోత్తమ్ వర్గీయులతో భేటీయైన జగ్గారెడ్డి..అదివారం ఎమ్మెల్యే మందుల సామేల్ తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు భారీగా గాంధీ భవన్ కు తరలివచ్చారు. వారంతా సామేల్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
నా హక్కులను కాలరాస్తానంటే తిరుగబడుతా : ఎమ్మెల్యే మందుల సామేల్
జగ్గారెడ్డితో భేటీ అనంతరం సామేల్ మాట్లాడుతూ..ఎంపీ చామల వర్గీయులు ఆరోపిస్తున్నట్లుగా ఒక్క మండలంలోనూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని తాను మండల పార్టీ అధ్యక్షుడిని చేయలేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లకు ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డవాళ్లకే టికెట్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఉన్న తొమ్మిది మంది పదవులను ఎవరూ కదిలించలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలనే నన్ను పార్టీలో రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని, ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలుగనంత వరకు సహిస్తానని, నా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే తిరుగుబడుతానంటూ మందుల సామేల్ తేల్చి చెప్పారు. కొందరు పార్టీని తమ సంస్థానం అని అనుకుంటున్నారని అలా అనుకుంటే కష్టం అని చెప్పారు. జగ్గారెడ్డితో మాట్లాడిన తరవాత అవసరం అయితే మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలను సైతం కలుస్తానని చెప్పారు.
గజ్వేల్ కాంగ్రెస్ లో పోటా పోటీ కమిటీలు
గజ్వేల్ నియోజకవర్గంలో పీసీసీ నియమించిన మండల కాంగ్రెస్ కమిటీలపై ఆగ్రహంతో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు తూంకుంట నర్సారెడ్డి పోటీ కమిటీలను ప్రకటించారు. తూంకుంట పోటీ కమిటీల వ్యవహారం పీసీసీ నిర్ణయాలను ధిక్కరించడమే అవుతుందంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు మండిపడుతున్నారు. మనోహరాబాద్, తూఫ్రాన్ మండల కమిటీల అధ్యక్షుల నియామకాలపై అసంతృప్తితో ఉన్న నర్సారెడ్డి తన వర్గీయులతో పోటీ కమిటీలను ప్రకటించడంతో పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఒక్కో మండలంలో రెండు కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ కేడర్ లో తీవ్ర అయోమయం నెలకొంది.