కొమ్ములతో సందర్శకుడిని గాల్లో ఎగరేసిన బైసన్ దున్న

భారీ బైసన్( అడవి దున్నపోతు) అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో సందర్శకుడిపై తీవ్రంగా దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. దున్న కొమ్ములతో సందర్శకుడిని గాల్లోకి ఎత్తి పడేయడంతో అతను దాదాపు 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Jul 12, 2026, 3:01 pm IST
Read Time: 3 mins
కొమ్ములతో సందర్శకుడిని గాల్లో ఎగరేసిన బైసన్ దున్న

విధాత :  భారీ బైసన్( అడవి దున్నపోతు) అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో సందర్శకుడిపై తీవ్రంగా దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. బ్రిడ్జ్ బే క్యాంప్‌ గ్రౌండ్‌లో ఆగ్రహానికి గురైన బుల్ బైసన్ ఓ సందర్శకుడిపై విరుచుకుపడింది. అతని వెంట పడి కొమ్ములతో గాల్లోకి ఎగరేసింది. తప్పించుకునేందుకు ఆ పర్యాటకుడు అక్కడ చెట్ల చుట్టు పరుగెత్తినప్పటికి ఆ పొగరుబోతు దున్నపోతూ అతడిని వెంటాడి మరి దాడి చేసింది. దీంతో సందర్శకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

దున్న కొమ్ముల దాటికి సందర్శకుడు దాదాపు 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు. ఈ ఘటనను ఫోటోగ్రాఫర్ మైక్ మాక్‌లియో వీడియోలో బంధించగా..అది వైరల్ గా మారింది. అదృష్టవశాత్తు ఆ సందర్శకుడికి సమీపంలో ఉన్నవారు ఆ జంతువు దృష్టిని మరల్చడంతో, దగ్గరలో ఉన్న అతని మనవడు ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు.

యెల్లోస్టోన్‌ నేషనల్ పార్కు లో ఇతర వన్యప్రాణుల కంటే దున్నపోతులే ఎక్కువ మంది సందర్శకులను గాయపరుస్తాయని, ఇలాంటి సంఘటనలను నివారించడానికి భద్రతా మార్గదర్శకాల ప్రకారం కనీసం 25 గజాల దూరం పాటించాలని యెల్లోస్టోన్ పార్కు అధికారులు పేర్కొన్నారు.