హైలైట్స్:
- పచ్చని అటవీ ప్రాంతాల్లో ఇక కాలుష్య గాలులు
- విషపూరితం కానున్న వికారాబాద్ కీ హవా
- శబ్దకాలుష్యంతో అనారోగ్యాల బారిన సమీప ప్రాంతాల ప్రజలు
- 1500 ఎకరాల్లో ‘సిటీ’ ఏర్పాటుకు తెలంగాణ ఏర్పాట్లు
- బతుకులు ఆగం అవుతాయంటున్న పర్యావరణ నిపుణులు
వికారాబాద్ కీ హవా.. లాఖో మరీజోంకా దవా! అని ఒక ప్రసిద్ధ నానుడి ఉంది. వికారాబాద్ పరిసరాల్లోని దట్టమైన అడవుల్లో వీచే స్వచ్ఛమైన గాలి.. అనేక రోగాలను చక్కబెడుతుందని నమ్మకం. ముఖ్యంగా క్షయ, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారికి అక్కడి వాతావరణం మేలు చేస్తుందని అప్పట్లో వైద్యులు నమ్మేవారు. అందుకే వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల ప్రాంతంలో క్షయ రోగులకు చికిత్స కోసం విశాలమైన ప్రాంతంలో ప్రత్యేక శానిటోరియం కూడా నిజాం హయాంలోనే నెలకొల్పారు. దశాబ్దాలపాటు అక్కడ చికిత్సలు కొనసాగాయి. ఇప్పటికీ ఈ ప్రాంతం హైదరాబాద్, సమీప ప్రాంతాలకు వెకేషన్ స్పాట్!
కట్ చేస్తే… కొద్దికాలంలోనే ఇక్కడి వాతావరణం విషపూరితం కానుంది. కాలుష్యం అంటే తెలియని ఊళ్లను రేడియేషన్ ఉక్కిరిబిక్కిరి చేయనున్నది. ప్రశాంతతకు నిలవైన ప్రాంతంలో చెవుల్లో గింగురుమనే శబ్దాలు నిత్యకృత్యం కానున్నాయి. ఇక్కడి నీళ్లు.. ఇక్కడి గాలి.. ఇక్కడి మట్టి.. కాలుష్యంతో కకావికలుకానున్నాయి! ఇక్కడి నుంచి పుట్టే మూసీ నది చేరుకునే గండిపేట చెరువుపై విషపు పడగలు విచ్చుకోనున్నాయి! అందులోని నీటిని తాగే హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడనున్నాయి.
కారణం..
వికారాబాద్ అడవుల సమీపంలో ఏర్పాటు చేయబోతున్న డాటా సెంటర్ సిటీ! గండిపేట చెరువుకు సుమారు 38 కిలోమీటర్ల ఎగువన.. చేవెళ్లకు సమీపంలోని ఆలూర్ గ్రామం వద్ద ఏకంగా 1500 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న అధునాతన సాంకేతిక రక్కసి.
"భారత్ ఫ్యూచర్ సిటీ సమీపంలో మీర్ ఖాన్ పేటలో ఇప్పటికే ఒక డాటా సెంటర్ వచ్చింది. చందన్ వెల్లిలో ప్రజలు వ్యతిరేకించడంతో తాత్కాలికంగా ఆగింది. "
- దొంతి నర్సింహారెడ్డి
ప్రపంచం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్నది. కొద్దికాలంలోనే విప్లవాత్మకంగా మారిన ఏఐ దానిని పరుగులు తీయిస్తున్నది. ఆర్థిక వ్యవస్థ డిజిటల్ అవుతున్నది. కృత్రిమ మేథ ఆ డిజిటల్ వ్యవస్థను పెను భారంగా మార్చుతున్నది. అందుకోసం పుట్టుకొస్తున్నవే డాటా సెంటర్లు. విచిత్రం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు డాటా సెంటర్ల ఏర్పాటును తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తుంటే.. మన ప్రభుత్వాలు మాత్రం.. డాటా సెంటర్ల ఏర్పాటుకు అత్యుత్సాహంతో ముందుకు వస్తున్నాయి. రాయితీలు ప్రకటిస్తూ ఎదురేగి స్వాగతం పలుకుతున్నాయి. నగర ప్రజలకు తాగునీరు అందిస్తున్న గండిపేట జలాశయం ఎగువన డాటా సెంటర్ (హీట్ జనరేటెడ్ సెంటర్) ఏర్పాటు చేయడం అంటే పెద్ద తూటు పొడవడమేనని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి చెప్పారు. ఇప్పటికే గండిపేట జలాశయం చుట్టూ సమస్యలు ఉన్నాయని, డాటా సెంటర్లతో సుడిగుండంలోకి నెట్టేయడమే అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ జలాశయం పేరు మర్చిపోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. జీవో 111 పై ఇప్పటికే అనేక కేసులు కోర్టులలో నడుస్తున్నాయని, జీవో 69ను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేయగా ఇప్పటికీ స్వీకరించడం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసును స్వీకరించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు స్వయంగా లేఖ రాసినా, తిరుగు సమాధానం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గండిపేట జలాశయం నిర్మాణం చేసి శతాబ్ధం పూర్తి అయిందని, దీన్ని పురాతన కట్టడంగా గుర్తించి పరిరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని తెలిపారు. జలాశయం ఎగువ భాగాన భారీ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో దీన్ని మర్చిపోవాల్సిందేనన్నారు. చుట్టు పక్కల జనవాసాలు ఉండవని, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
"డాటా సెంటర్లు అంటే వేడిని పుట్టించే కేంద్రాలు. నిత్యం విద్యుత్ ధగ ధగలతో పనిచేస్తాయి. చుట్టు పక్కల నివాసం ఉండేవారికి జీవితం నరకప్రాయంగా ఉంటుంది. విద్యుత్ కాంతుల మూలంగా నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుస్థితి ఉంటుంది."
- దొంతి నర్సింహారెడ్డి
డాటా సెంటర్ల కోసమే సిటీ
ఇప్పటికే హైదరాబాద్‌లో పలు డాటా సెంటర్లు ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో పాటు కంట్రోల్‌ఎస్ (CtrlS), క్యాపిటల్‌ల్యాండ్ (CapitaLand), ఎస్‌టీటీ జీడీసీ (STT GDC), ఎన్‌టీటీ డాటా (NTT Data), సిఫీ (Sify), టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) వంటి సంస్థలు డాటా సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 150–200 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లు పనిచేస్తుండగా, మరో 5 గిగావాట్ల (GW) సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వివిధ కంపెనీలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం తెలంగాణలో మొత్తం ప్రతిపాదిత డాటా సెంటర్ల సామర్థ్యం 11 గిగావాట్లకు పైగా ఉండనుంది. కానీ.. ఏకంగా 1500 ఎకరాల్లో కేవలం డాటా సెంటర్ల కోసమే ఒక సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పర్యావరణవేత్తలను, వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కలవరానికి గురి చేస్తున్నది. ఈ విషయంలో దొంతి నర్సింహారెడ్డి విధాతతో మాట్లాడుతూ.. డాటా సెంటర్లు అంటే వేడిని పుట్టించే కేంద్రాలు అని, నిత్యం విద్యుత్ ధగ ధగలతో పనిచేస్తాయని, చుట్టు పక్కల నివాసం ఉండేవారికి జీవితం నరకప్రాయంగా ఉంటుందని చెప్పారు. విద్యుత్ కాంతుల మూలంగా నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుస్థితి ఉంటుందని ఆయన వివరించారు. నిజానికి ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ డాటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా నగరాలను ఏర్పాటు చేసింది లేదు. కానీ.. దేశంలోనే మొట్టమొదటి డాటా సెంటర్ సిటీ.. చేవెళ్ల సమీపంలోని ఆలూర్ వద్ద ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్, నీరు, రవాణా అనుసంధానం వంటి అంశాలపై సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఇప్పటికే భూమిని గుర్తించింది. ఇక పనులు మొదలు కావడమే ఆలస్యం. భారత్ ఫ్యూచర్ సిటీ సమీపంలో మీర్ ఖాన్ పేటలో ఇప్పటికే ఒక డాటా సెంటర్ వచ్చిందని, చందన్ వెల్లిలో ప్రజలు వ్యతిరేకించడంతో తాత్కాలికంగా ఆగిందని నర్సింహారెడ్డి గుర్తు చేశారు.
"డాటా సెంటర్లకు చల్లదనం ఎక్కువగా ఉండాలి. అందుకోసం పెద్ద ఎత్తున నీళ్ళు, విపరీతమైన విద్యుత్ సమకూర్చాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల నుంచి వచ్చే నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం సాధ్యం కాదు. వాటిలో కెమికల్స్ ఉంటాయి."
- దొంతి నర్సింహారెడ్డి
ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతలు..
అమెరికా, పలు యూరప్ దేశాల్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని స్థాయిలో విద్యుత్తు, నీటి వినియోగం, శబ్ద, వాయు కాలుష్యాలు, తక్కువ ఉపాధి అవకాశాలు, స్థానిక ప్రజలకు వాటితో ఏమాత్రం ఉపయోగం లేకపోవడంతో వాటిని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని వర్జీనియా, న్యూ యార్క్, జార్జియా, కొలరాడో, టెన్నసీ, మైన్ తదితర రాష్ట్రాల ప్రజలు, పర్యావరణ సంస్థలు కలిసి అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. వీటికి పర్యావరణ అనుమతులు, మితిమీరిన నీటి వినియోగం, గరిష్ఠస్థాయిలో విద్యుత్తు వినియోగం, డీజిల్ జనరేటర్ల కారణంగా పెరిగే కాలుష్యంపై అనేక కేసులు నమోదయ్యాయని ది గార్డియన్‌లో వచ్చిన వ్యాసం పేర్కొంటున్నది. 2025–26లో వివిధ స్థానిక ఉద్యమాల కారణంగా 12 లక్షల కోట్ల రూపాయల నుంచి 14 లక్షల కోట్ల రూపాయల విలువైన డాటా సెంటర్ల ఏర్పాటు నిలిచిపోవడం లేదా తాత్కాలికంగా ఆగిపోయాయని అంచనా. కొన్ని నగరాలు కొత్తగా ఏర్పాటు చేసే డాటా సెంటర్ల విషయంలో తాత్కాలిక నిషేధాలు విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనల కోసం బిల్లులను ప్రవేశపెట్టాయి. యూరప్‌లోని ఐర్లా్ండ్, ఫ్రాన్స్‌లోని మార్సెలై, స్పెయిన్‌లోని తలవేరా డే లా రీనా, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. చిలీలో గూగుల్ డాటా సెంటర్ ప్రాజెక్టుకు అధిక నీటి వినియోగంపై వచ్చిన వ్యతిరేకతతో దానిని నిలిపివేశారు. ప్రపంచ వ్యాప్తంగా డాటా సెంటర్లపై న్యాయ పోరాటాలకు చిలీ కేసు ఉదాహరణగా మారింది.
అప్పనంగా దొరుకుతున్న వర్థమాన దేశాలు
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీలు వర్ధమాన దేశాలను ఎంచుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. పర్యావరణ నిబంధనలు కఠినంగా లేకపోవడం, అనుమతులు సత్వరమే మంజూరుకావడం, భూమి చౌకగా లభించడం, ఆ మాటకొస్తే ప్రభుత్వాలే అప్పనంగా భూములు అప్పగించడం, విద్యుత్తు, నీటి వినియోగంపై ప్రభుత్వాల రాయితీలు, ఇతర దేశాలతో పోల్చితే వర్ధమాన దేశాల్లో డాటా సెంటర్లకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల నిరసనలు, న్యాయపోరాటాలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో వర్ధమాన దేశాలపై ఈ డాటా సెంటర్ల పెంట పడేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పెంట తెలుగు రాష్ట్రాలను కూడా బలంగానే తాకబోతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎదురేగి మరీ ఏకంగా డాటా సెంటర్ సిటీనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైపోయింది.
డాటా సెంటర్లతో సమస్యలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల విస్తరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డాటా సెంటర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. వాస్తవానికి ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవి కీలక మౌలిక సదుపాయాలు అయినప్పటికీ.. వాటి నిర్వహణ.. పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై, పర్యావరణంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాటా సెంటర్లు సహజంగానే టాక్సిక్ కాకపోయినప్పటికీ.. వాటిని ఎలా నిర్మించారు? ఎలాంటి విద్యు్త్తు వనరులు ఉపయోగిస్తున్నారు? కూలింగ్ సిస్టమ్ ఎలాంటివి? స్థానిక పరిస్థితులను బట్టి వాటి ప్రభావాల తీవ్రత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
నిత్యం శబ్ద కాలుష్యం
డాటా సెంటర్లలో వేల కొద్దీ సర్వర్లను ఉంచుతారు. అవి నిత్యం చల్లగా ఉండాలి. అందుకోసం భారీ స్థాయిలో కూలింగ్ ఫ్యాన్లు, వెంటిలేషన్ వ్యవస్థలు 24 గంటలూ పనిచేస్తూనే ఉంటాయి. ఫలితంగా తక్కువ ఫ్రీక్వెన్సీతో కూడిన నిరంతర శబ్దం లేదా ఇన్‌ఫ్రాసౌండ్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ శబ్దం చాలా దూరం వినిపిస్తుంది. తరచూ దీనికి ప్రభావితం అయ్యేవారు.. అంటే డాటా సెంటర్లకు సమీపంలో నివసించేవారికి తలనొప్పి, మైగ్రేన్, చెవుల్లో రింగుమంటూ మోత సర్వసాధారణం అవుతాయి. ఫలితంగా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు సైతం చుట్టుముడుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. డాటా సెంటర్ స్థాయి, అక్కడి నియంత్రణ చర్యలు, సమీప ప్రాంతాల దూరం వంటివాటిని బట్టి కొంత తేడాలు ఉండొచ్చని అంటున్నాయి. ‘డాటా సెంటర్లకు చల్లదనం ఎక్కువగా ఉండాలి. అందుకోసం పెద్ద ఎత్తున నీళ్ళు, విపరీతమైన విద్యుత్ సమకూర్చాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల నుంచి వచ్చే నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం సాధ్యం కాదని, కెమికల్స్ ఉంటాయి’ అని దొంతి నర్సింహారెడ్డి చెప్పారు.
గాలి నాణ్యతపైనా ప్రభావం
డాటా సెంటర్లకు నిత్యం విద్యుత్తు సరఫరా అవసరం. విద్యుత్తు సరఫరాలో సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా చాలా డాటా సెంటర్లలో డీజిల్ లేదా గ్యాస్‌తో పనిచేసే జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి పనిచేసే సమయంలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు (పర్టిక్యులేట్ మ్యాటర్). నైట్రోజన్ ఆక్సైడ్స్ తదితర కాలుష్యవాయువులు విడుదలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి భారీ స్థాయిలో విడుదలైనా, తరచూ విడుదలైనా సమీప ప్రాంతాల ప్రజలు ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సవాలు విసిరే నీటి వినియోగం…
ముందు చెప్పుకొన్నట్టు డాటా సెంటర్లలో సర్వర్లను నిత్యం చల్లబర్చేందుకు ఉద్దేశించిన వివిధ రకాల కూలింగ్ సిస్టమ్స్… రోజూ కొన్ని లక్షల లీటర్ల నీటిని వాడుతాయి. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్థానికంగా ఉన్న నీటి వనరులపై ఒత్తిడిని పెంచుతుంది. సమీప ప్రాంతాల వ్యవసాయాలు దెబ్బతింటాయి. కొన్ని ప్రత్యేక ఇండస్ట్రియల్ కూలింగ్ సిస్టమ్స్‌లో పీఎఫ్‌ఏఎస్ (ఫరెవర్ కెమికల్స్) వంటి రసాయనాల వినియోగించిన ఘటనలు గతంలో నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఈ రసాయనాలు తాగునీటిలో కలిసినా, భూగర్భజలాల్లోకి ఇంకినా తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. నేరుగా తాగునీటిలో కలిస్తే కిడ్నీ, లివర్ దెబ్బతినడంతోపాటు.. సంతానోత్పత్తి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని, గర్భస్థ శిశువుల్లో దుష్పరిణామాలను కలుగజేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
డాటా సెంటర్లలో పనిచేసేవారికీ ముప్పే
డాటా సెంటర్ల వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ.. స్థానికులకు మాత్రం ఎలాంటి అవకాశాలూ ఉండబోవనేది ప్రపంచవ్యాప్తంగా డాటా సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వాస్తవ అంశంగా ముందుకు వచ్చింది. ఉపాధి అవకాశాలు లభించినా అదే స్థాయిలో అనారోగ్యాలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాటా సెంటర్లలోని సర్వర్లకు ఉండే ఫ్యాన్లు అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాని వల్ల అక్కడ పనిచేసేవారిలో వినికిడి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇతర అన్ని పరిశ్రమల్లో ఉండే ప్రమాదాలూ పొంచి ఉంటాయి. అంటే.. భారీ పరికరాలు మోసే సమయంలో అదుపు తప్పితే గాయపడటం, నిచ్చెనలపై పనిచేసే సమయంలో కిందపడటం, అధిక ఓల్టేజీ విద్యుత్తు వ్యవస్థల మధ్య పనిచేసే సమయంలో విద్యుదాఘాతాలు, అక్కడ ఉపయోగించే కెమికల్స్ మీద పడితే వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకే డాటా సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక భద్రతా ప్రమాణాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, అక్కడ పనిచేసేందుకు తగిన శిక్షణ తప్పనిసరి చేస్తారు.
వ్యర్థ జలాల శుద్ధి పెను సవాలు
డాటా సెంటర్లు ఉపయోగించే లక్షల కొద్దీ లీటర్ల నీటిని శుద్ధి చేయడం పెద్ద సమస్యగా ఉంటుంది. ఒక మెగావాట్ లోడ్‌కు సంవత్సరానికి 25.5 మిలియన్ లీటర్ల నీరు అవసరమని అంచనా. గూగుల్ విషయానికి వస్తే 2023లో అన్ని డాటా సెంటర్లలో 5 బిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ నీటి వినియోగించింది. ఒక ఏఐ చాట్ బాట్ సెషన్ ఒక సీసా మంచినీటి బాటిల్‌ను వినియోగిస్తుంది.. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక ప్రశ్నకు ఒక చెంచా నీరు తాగేస్తుంది.
ఆధునిక డాటా సెంటర్లలో ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగిస్తుంటారు. మళ్లీ ఉపయోగించేని నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాలకు (ఈటీపీ, ఎస్టీపీ) తరలించాల్సి ఉంటుంది. అక్కడ శుద్ధి చేసిన తర్వాత నదులు, ఇతర జల వనరుల్లో విడుదల చేయడం లేదా ఇతర అవసరాలకు ఉపయోగించడం చేస్తుంటారు. అందుకోసమే కొన్ని దేశాల్లో అతి శీతల ప్రదేశాల్లో, జనావాసాలకు పూర్తి దూరంగా వీటిని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ల ఉన్నాయి.