కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి…ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

కాళేశ్వరం కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేసుకుంటామని ప్రకటిస్తూ ప్రభుత్వానికి సంచలన సవాల్ విసిరారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 06, 2026, 3:59 pm IST
Read Time: 6 mins
కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి…ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

గోదావరిలో వృధాగా దిగువకు వెళ్లిపోతున్న నీళ్లను రైతులకు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు లను ప్రభుత్వం ఆన్ చేయాలని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఏ చిన్న ప్రమాదం జరిగినా…మా బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేసుకుంటాం, శాశ్వతంగా మేం రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి సంచలన సవాల్ చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లుగా కన్నెపల్లి పంప్ లు ఆన్ చేస్తే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ప్రమాదం జరిగితే…అందుకు పూర్తి బాధ్యత కేసీఆర్, బీఆర్ఎస్ తీసుకుంటుందని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కోరిన అండర్ టేకింగ్ ఇచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్, మేం సిద్దం అని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌కి ఏం జరిగినా నాదే బాధ్యత అని కేసీఆర్ అండర్ టేకింగ్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజల తరుపున సిద్ధంగా ఉన్నాడని, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన కేసీఆర్.. తాను కట్టిన ప్రాజెక్టును నాశనం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

అసలు రాష్ట్రానికి సంబంధించి బ్యారేజీలలో ఎన్డీఎస్ఏ పాత్ర లేదని, ఎన్డీఎస్ఏ చెప్పిందంటూ బ్యారేజీలను నిరూపయోగంగా పెట్టి కరువు పరిస్థితుల్లో నీళ్లను కిందకు వదిలేయడం అన్యాయంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్వహణలో ఎన్డీఎస్ఏ పాత్ర, నివేదికలు నిజమైతే ఎస్ఎల్బీసీలో 8 మంది కార్మికుల ప్రాణాలు బలైనందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను జైళ్లో వేసి ఉండేవారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.

కాళేశ్వరం కన్నెపల్లి మోటర్లు ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని, కానీ కనీస జ్ఞానం, సోయి లేని కాంగ్రెస్ మంత్రులు మాత్రం ప్రాజెక్టును నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే నీళ్లు ఇవ్వొచ్చని మీడియా సాక్షిగా చూపించామని, రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం తెలంగాణను ఎడారిగా మార్చేందుకు నాటకాలు ఆడుతోందని, రైతుల పొట్టగొట్టే ఈ దుర్మార్గపు తీరు నశించాలన్నారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేయడం మీకు చేతకాకపోతే కేటీఆర్ చెప్పినట్లుగా కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. కొందరు మంత్రులకు పంపులు ఆన్ చేసి నీళ్ల విడుదలకు సంబంధించి నిజాలు తెలిసినా..తమ మంత్ర పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం పంపులను ఆన్ చేయని పక్షంలో రైతాంగంతో కలిసి ఉద్యమిస్తామని జగదీశ్ రెడ్డి ప్రకటించారు.