విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో నీటి నిల్వ చేస్తే దానితో పాటు అన్నారం, సుందిళ్ల సహా మూడు బ్యారేజీలు కూలిపోయి దిగువన ఉన్న 44గ్రామాలు, భద్రాచలం టౌన్, ఆలయం కూడా కొట్టుకపోయే ప్రమాదం ఉందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఆ శాఖను విధ్వంసం చేశారని ఆరోపించారు. అధిక వడ్డీలకు రాష్ట్ర ప్రజలను, వారి తర్వాతి తరాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పాలకులు ఇచ్చిపోయారని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తి పడి లక్ష కోట్లను గోదావరి పాలు చేశారని, వారి వల్లనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగ్ సైతం కాళేశ్వరం అక్రమాలను బహిర్గతం చేసిందన్న సంగతి మరువరాదన్నారు.
జాతీయ, అంతర్జాతయ నిపుణులు ఎన్డీఏస్ఎ చాల స్పష్టంగా, లిఖిత పూర్వకంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను ఉపయోగించలేమని చెబుతుంటే..వాటి గేట్లు ఎత్తి ఉంచాలని చెప్పారని ఉత్తమ్ మరోసారి గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులేమో వాటిలో నీళ్లు నిల్వ చేయాలని, పంపింగ్ చేయాలని కోరుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల పునాదులు నీటి నిల్వకు అనుకూలంగా లేవని ఎన్డీఎస్ఏ, నిపుణుల బృందాలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని పేర్కొన్నారు. కేటీఆర్ కంటే ఎన్డీఎస్ఏ వారికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేం భావిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టడం, కూలడం జరిగిపోయిన సంగతి మరిచిపోయి..ఇప్పుడు పంపింగ్ చేయమంటూ మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.
ప్రస్తుతం మేడిగడ్డ వద్ద గోదావరి నీళ్లు పారడం లేదని, కొంత మేరకు ప్రాణహిత నీళ్లు మాత్రమే వస్తున్నాయని ఉత్తమ్ స్పష్టం చేశారు. అయితే కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే ఆ నీటిని అన్నారం, సుందిళ్లకు, ఎల్లంపల్లికి మళ్లించాల్సి ఉంటుందని, అప్పుడు ఆ బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు.వాటి పునాదులు నీటి నిల్వకు అనుకూలంగా లేవన్న నిపుణుల సలహా మరువరాదని ఉత్తమ్ పేర్కొన్నారు. గేట్లు కిందకు దించకుండా పంపింగ్ చేయడం కుదరదన్న సంగతి అంతా అర్ధం చేసుకోవాలన్నారు. గేట్లు దించితే ఆ మూడు బ్యారేజీలు కొట్టుకపోయే ప్రమాదం ఉందన్నారు.
తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం మేడిగడ్డకు మార్చి ఉత్తర తెలంగాణ వాసులకు బీఆర్ఎస్ తీరని ద్రోహం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. తుమ్మిడి హట్టి మీద 33వేల కోట్లలో 11వేల కోట్లు ఖర్చు పెట్టారని, అప్పటికే జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారని, మళ్లీ కమిషన్లు రావన్న ఉద్దేశంలో తుమ్మిడిహట్టిని మార్చి మేడిగడ్డకు మార్చారని ఉత్తమ్ విమర్శించారు. 35వేల కోట్లతో కట్టే ప్రాణహిత చేవళ్లను కాళేశ్వరంగా మార్చేసి లక్ష కోట్లు దుర్వినియోగం చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిన బీఆర్ఎస్ పాలకులను ఏ విధంగా శిక్షించాలో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. 2018లో కాళేశ్వరం డీపీఆర్ కు సీడబ్ల్యూసీ అనుమతిస్తే అది రాకముందే 2016లో ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తీరు కాంట్రాక్టర్లలో బీఆర్ఎస్ పాలకుల కుమ్మక్కు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం నీళ్లు వాడకుండానే రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిందన్న వాస్తవం విస్మరించరాదన్నారు.
కాళేశ్వరం డీపీఆర్ లో 18లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18లక్షల స్టెబిలైజేషన్ చూపారని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్లమెంటులో మద్దుతునివ్వగా ఏర్పాటైన ఎన్డీఎస్ఏ స్వయంగా కాళేశ్వరం డిజైన్, నిర్మాణంలో శాస్త్రీయ లోపాలను, అక్రమాలపై నివేదికలు వెల్లడించాయన్నది ఆ పార్టీ నాయకులు గుర్తెరుగాలని ఉత్తమ్ హితవు పలికారు. మూడు బ్యారేజీల పునాదుల స్థితిగతులపై శాస్త్రీయ పరిశోధనలు జరుగతున్నాయని, వాన కాలం కారణంగా ఆగిపోయినప్పటికి…వచ్చే వేసవిలో మళ్లీ ఆ పనులు పూర్తి చేసి, బ్యారేజీల నిర్వహణ మరమ్మతులు చేపట్టి 2027 జూలై నాటికి ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అన్నారు.