అదృష్టవంతురాలు..బావిలోనే ప్రాణాలతో 21గంటలు ..వైరల్

కూలి పనికి వెళ్లిన మహిళపై దాడి చేసి, ఆభరణాలు, నగదును దోచుకుని ఆమెను బావిలోకి తోసేసిన ఘటనలో బాధితురాలు 21గంటల పాటు బావిలోనే గడిపి మరుసటి రోజు గ్రామస్తుల సహాయంలో ప్రాణాలతో బయటపడిన ఘటన వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 05, 2026, 1:47 pm IST
Read Time: 6 mins
అదృష్టవంతురాలు..బావిలోనే ప్రాణాలతో 21గంటలు ..వైరల్

విధాత : కూలి పనికి వెళ్లిన మహిళపై దాడి చేసి, ఆభరణాలు, నగదును దోచుకుని ఆమెను బావిలోకి తోసేసిన ఘటనలో బాధితురాలు 21గంటల పాటు బావిలోనే గడిపి మరుసటి రోజు గ్రామస్తుల సహాయంలో ప్రాణాలతో బయటపడిన ఘటన వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపిన వివరాల మేరకు..కరీంనగర్‌కు చెందిన బాధితురాలు 55ఏళ్ల జి. లక్ష్మి కూలి పని వెతుక్కుంటూ పట్టణంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఉన్న లేబర్ అడ్డాకు వెళ్లింది. ఎప్పటిలాగే తల్లి లక్ష్మీని కొడుకు సందీప్ కూలి అడ్డా వద్ద దిగబెట్టి వెళ్లిపోయాడు.

ఇంతలో ఆన్ లైన్ బెట్టింగ్ లతో అప్పుల పాలైన కరీంనగర్ గొల్లపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి డి. దినేష్ రెడ్డి ముందస్తు వేసుకున్న పథకం మేరకు అక్కడికి చేరుకున్నాడు. మా వద్ధ కూలి పని ఉందంటూ చెప్పి ఆమెను ఒక రాపిడో బైక్‌ను బుక్ చేసి తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. ఆమె నుంచి ఆభరణాలు దోచుకుని, చంపే ఉద్దేశంతో అక్కడి నుంచి జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్నాక ఆమెపై దాడి చేసి 5 గ్రాముల బంగారం, 20గ్రాముల వెండి ఆభరణాలను దోచుకుని, సమీపంలోని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. లక్ష్మి బావిలోపల తాడు సహాయంతో బయటకు ఎక్కడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆ తాడును కత్తిరించి పారిపోయాడు.

ఈత వచ్చిన ఆ మహిళ, స్థానిక రైతులు ఆమె కేకలను గుర్తించేలోపు 21 గంటల పాటు మోటారు పైపును పట్టుకుని అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. ఈత రావడంతో లక్ష్మి రాత్రంతా బావిలో తేలుతూనే ఉందని పోలీసులు తెలిపారు. జూలై 1వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 7.30 గంటల వరకు, ఆమె ఒక తాడు, పైపును పట్టుకుని బావిలో ప్రాణాలతో ఉంది. బావిలో ఈదుకుంటూ, మోటార్ పైపును పట్టుకుని రాత్రంతా ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ నరకం అనుభవిస్తూ సహాయం కోసం చూసింది. రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో కొడుకు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం, గ్రామస్తులు ఆమె సహాయం కోసం వేసిన కేకలు విని, ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు.

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఫోన్ డేటాను విశ్లేషించి శనివారం దినేష్ రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడు ఆన్‌లైన్ జూదానికి బానిసయ్యి రూ.4లక్షలు పోగొట్టుకున్నాడు. అతను లోన్ యాప్‌ల ద్వారా డబ్బు అప్పుగా తీసుకుని, అప్పుల నుండి బయటపడటానికి దోపిడీ పథకాన్ని రూపొందించాడని కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు.

నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, దొంగిలించిన బంగారాన్ని కరీంనగర్‌లోని ఒక నగల వ్యాపారి నుంచి , అతని వద్ద నుంచి మిగిలిన విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పోలీసులు పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.