విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల మధ్య బంగారం, ధరలలో అస్థిరత కొనసాగుతుంది. మూడు రోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేసిన బంగారం, వెండి ధరలు మళ్లీ శాంతించాయి. దేశీయా మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేయగా..వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 270 తగ్గి రూ.1,46,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.1,34,500 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,60,000 వద్ద స్థిరంగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం మే 13వ తేదీన బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం డిమాండ్ ఏకంగా 70 శాతానికి పైగా పడిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులను కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కోరడం, దిగుమతుల సుంకాల పెంపు, అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాలు భారత్ లో పసిడి మార్కెట్ కు ప్రతికూలంగా మారాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో వినియోగదారులు, పెట్టుబడిదారులు కొత్తగా బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని అమ్ముకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో కొత్త ఆభరణాల కొనుగోళ్లు తగ్గడంతో.. పాత ఆభరణాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.2026 ఏప్రిల్ మరియు జూన్ మాసాల మధ్య సుమారు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి తిరిగి ప్రవేశించిందని అంచనాలు వెలువడ్డాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం అదనపు పెరుగుదలను సూచిస్తోంది.
ప్రస్తుత అధిక ధరల ప్రయోజనాన్ని పొందాలని, భవిష్యత్తులో ధరలు మరింత పడిపోతాయనే భయాల కారణంగా చాలా కుటుంబాలు తమ వద్ద ఉన్న ఆభరణాలను విక్రయిస్తున్నాయి. గడిచిన జనవరిలో 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా సుమారు రూ.1,80,000కి చేరుకోగా, జూన్ నాటికి అది ఏకంగా 30 శాతం తగ్గి రూ. 1,40,000 మార్కుకు పడిపోయింది. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం ధరలు తగ్గిపోవడం తాత్కాలికమేనని..దీర్ఘకాలికంగా ఖచ్చితం బంగారం ధరలు మళ్లీ పైకి దూసుకపోవడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు.