భూ దందాల ప్రాధాన్యతగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన సాగుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ రెండు రెట్లు పెరిగిందని ఈటల ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన భూములు, పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాలు, చివరికి ప్రభుత్వమే లేఅవుట్లు వేసి విక్రయించిన భూములను కూడా ’22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని ఈటల మండిపడ్డారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం వెనుక ..వాటిని భూమాఫియాకు కట్టబెట్టాలనే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. “ధరణి పోర్టల్ రద్దు చేసినా, భూములను లాక్కునే ప్రభుత్వాల ధోరణిలో ఏ మార్పు రాలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూ దందాలకు పాల్పడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ భూములను ‘సైటిల్ మెంట్’ చేసుకుంటోందని ఈటల ఆరోపించారు. గతంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చు చేసిన డబ్బులు ఇలాంటి భూ దందాల ద్వారా వచ్చినవేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ధరణి నుంచి భూ-భారతి వరకు పేద రైతులపైనే భారం పడుతుందని, 22ఏ నిషేధిత చట్టాన్ని కేసీఆర్ తీసుకొస్తే దాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణిని రద్దు చేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పారని, కానీ ధరణి తర్వాత తీసుకొచ్చిన భూ-భారతితో పేద రైతాంగం ఇబ్బందులు పడుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గల్ఫ్ ఆయిల్ కంపెనీకి చెందిన భూములు ఫీనిక్స్ కంపెనీ మీదుగా ఎలా చేతులు మారాయో అందరికీ తెలుసని, ఈ అక్రమాల్లో పెద్దల హస్తం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పేదలకు, రైతులకు అన్యాయం చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాలకు కొమ్ము కాయడం మానుకోవాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ అరాచకాలను అడ్డుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
రాబరీ మినిస్టర్ పొంగులేటి: మహేశ్వర్ రెడ్డి
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాబరీ మినిస్టర్ గా మారరని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మంత్రి కాకముందు నీ ఆస్తులెంత.. ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. లక్షల కోట్ల భూములను 22ఏ జాబితాలో పెట్టి భూదందా చేస్తున్నారని, ప్రభుత్వం బ్రోకర్‌లా మారిందని మండిపడ్డారు. మంత్రికి, ప్రభుత్వానికి మధ్య ఫీనిక్స్ కంపెనీ మీడియేటర్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్‌కు ఫీనిక్స్ కంపెనీ బినామీగా ఉందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు అదే కంపెనీతో కలిసి బ్రోకర్లుగా మారారని విమర్శించారు. ఫీనిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్‌స్ట్రక్షన్స్, పొంగులేటికి చెందిన కంపెనీలకు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులు బదిలీ అయ్యాయని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తన శాఖలో తప్పులు జరిగాయని మంత్రి అంగీకరిస్తూ క్షమాపణ కోరుతున్నప్పుడు బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. తప్పులు చేసిన అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.లక్షల కోట్ల విలువైన ఆస్తులను దోచుకుని, బదలాయించుకుని ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.