▪️ సినీ ఇండస్ట్రీలో మాఫియా రాజ్యమేలుతోంది
▪️ అడుగడుగునా మోసం, దగా ఉంది
▪️ ఎలాగైనా సినిమాను త్వరలో రీరిలీజ్ చేస్తాను
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష తీవ్రస్థాయికి చేరిందని, కష్టపడి నిర్మించిన చిత్రాలకు థియేటర్లు ఇవ్వకుండా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను నాశనం చేస్తున్నారని ‘ఓ అందాల రాక్షసీ’ మూవీ మేకర్, హీరో షిరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించానని, అయితే ఈ సినిమాను సరిగ్గా థియేటర్లలో విడుదల చేస్తే రికార్డులు బద్దలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ల కేటాయింపులో ఎదురవుతున్న అన్యాయంపై ఇప్పటికే 40 కి పైగా ప్రెస్ మీట్లు, 50 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు తెలిపారు.
“క్యూబ్, యుఎఫ్ఒలు దోపిడీ చేస్తున్నాయి”
సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని షిరాజ్ ఆరోపించారు. క్యూబ్, యుఎఫ్ఒ డిజిటల్ ప్రొవైడర్లు వారానికి రూ. 2,000 లో చేసే పనికి ప్రతి థియేటర్ నుండి రూ. 10 వేల నుండి ₹12 వేల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారని తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్ తీరుపై మండిపాటు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చిన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు అండగా నిలవకపోగా, నల్లుల లాగా నలిపేస్తోందని ధ్వజమెత్తారు. ఐనాక్స్, పివిఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు మొదట థియేటర్లు ఇస్తామని చెప్పి, చివర్లో హ్యాండ్ ఇచ్చారని, దీనిపై చట్టపరంగా నోటీసులు ఇచ్చామని, హైకోర్టు నుండి సమన్లు కూడా వెళ్లాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
సినిమా పరిశ్రమలో సాగుతున్న ఈ మాఫియా పోకడలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని, చిన్న సినిమాలకు తగిన రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పరిశ్రమలో పనిచేసే డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు బెదిరింపులు వచ్చినా, ప్రాణాలు పోయినా సరే చిన్న సినిమాల హక్కుల కోసం తన పోరాటం ఆగదని, 100 ప్రెస్ మీట్లు, ర్యాలీలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతిమంగా ఈ యుద్ధంలో విజయం సాధించి తీరుతానని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘ఓ అందాల రాక్షసీ’ చిత్రాన్ని తీసుకొస్తానని ఆయన స్పష్టం చేశారు.
‘ఓ అందాల రాక్షసీ’ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని, పరిశ్రమలోని పెద్దల వైఖరి వల్ల చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు దారుణంగా దెబ్బతింటున్నారని పలువురు సినీ, న్యాయ, రక్షణ రంగాల ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
చిన్న ప్రొడ్యూసర్లను బలితీసుకుంటున్నారు: ప్రొడ్యూసర్ అహ్మద్
సమావేశంలో ప్రొడ్యూసర్ అహ్మద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “పరిశ్రమలో చిన్న సినిమాలకు, చిన్న ప్రొడ్యూసర్లకు కనీస గౌరవం, అవకాశాలు దక్కడం లేదు. ఎంతో శ్రమించి, కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన సినిమాలను థియేటర్లు ఇవ్వకుండా తొక్కిపెడుతూ ప్రొడ్యూసర్లను పూర్తిగా చంపేస్తున్నారు. ఈ రకమైన దోపిడీ వ్యవస్థ మారకపోతే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి సినిమాను బతికించండి: జబర్దస్త్ పార్థు
జబర్దస్త్ పార్థు మాట్లాడుతూ.. “కంటెంట్ ఉన్న ఇంత మంచి సినిమాకు థియేటర్లు ఇవ్వకపోవడం నిజంగా విచారకరం. కష్టపడి తీసిన ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు రాకుండా అడ్డుకోకండి. పరిశ్రమ నిలబడాలంటే ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించి బతికించాలి” అని కోరారు.
ఫిలిం ఛాంబర్ స్పందించాలి.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి: రిటైర్డ్ ACP లక్ష్మణ్
రిటైర్డ్ ACP లక్ష్మణ్ మాట్లాడుతూ.. “ఒక చిన్న సినిమాను తొక్కిపేస్తే దాని వెనుక ఉన్న ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ‘ఓ అందాల రాక్షసీ’ సినిమా చాలా బాగుంది. ఇలాంటి చిత్రాలకు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయాలి. ఈ సమస్యలన్నింటినీ అందరూ కలిసికట్టుగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని సూచిస్తున్నాను” అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న శైలజ కూడా చిత్రబృందానికి తన పూర్తి మద్దతు తెలిపారు.
ఇండస్ట్రీలో 80% మాఫియా ఉంది.. అవగాహన లేకుండా రావద్దు: హైకోర్టు అడ్వకేట్, ప్రొడ్యూసర్ ఆర్.వి. రెడ్డి
హైకోర్టు అడ్వకేట్, ప్రొడ్యూసర్ ఆర్.వి. రెడ్డి ఇండస్ట్రీలోని లోసుగులను, తన అనుభవాలను వివరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలు డబ్బులు తీసుకుని 200 థియేటర్లు ఇస్తామని చెప్పి కేవలం 60 థియేటర్లలోనే విడుదల చేయడంతో మేం రూ. 10 కోట్లు నష్టపోయాం. ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా రావడం మా లాంటి వారి తప్పే. కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇండస్ట్రీ పరిస్థితులు తెలుసుకోకుండా బ్లైండ్‌గా రాకండి.”
“ఈరోజు సినీ పరిశ్రమలో 80% మాఫియా ఏలుతోంది. కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారు. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? సినిమాకు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? అనేది ముందుగా తెలుసుకోండి. ఈ రోజుల్లో రూ. 50 లక్షలు, కోటి రూపాయలతో సినిమా తీస్తామని చెప్పి చాలామంది మభ్యపెడతారు. కానీ థియేటర్లలో పెద్ద సినిమాగా రాణించాలంటే కనీసం ₹50 కోట్లు లేనిదే కుదరని పరిస్థితి ఏర్పడింది. డైరెక్షన్, ప్రొడక్షన్, మెయిన్‌గా డిస్ట్రిబ్యూషన్ దగ్గరే అసలు ప్రాబ్లమ్ వస్తుంది. మనకు ఇండస్ట్రీ బేసిక్స్ తెలియకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. అయితే కొత్త డైరెక్టర్లు మోసం చేయాలనుకోరు, వారు ఎలాగైనా ఎదగాలని కష్టపడతారు. కాబట్టి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీ మార్కెట్‌పై అవగాహన పెంచుకుని అడుగులు వేయాలి” అని ఆర్.వి. రెడ్డి హితవు పలికారు.