మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి,నిజాయితీ, నిబద్ధత ఉందని అందువల్లే 22ఏ నిషేధిత భూముల జాబితాలో తప్పు జరిగితే అంగీకరించామని..ధరణితో అక్రమాలు చేసి మీ మాదిరిగా మేం దబాయించడం లేదని..జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెప్పి.. తప్పులను సవరిస్తామని ప్రకటించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రజల ఆస్తులను 22ఏలో ఉద్దేశపూర్వకంగానే పెట్టి వాటిని రిలీజ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడానికే ఈ తతంగాన్ని నడుపుతున్నారంటూ హరీశ్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందించారు. హరీశ్ రావు కాదు ఆయన అబద్దాలరావుగా మారారని ఎద్దేవా చేశారు. పొరపాటు జరిగిందని నేనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని, 22ఏ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు హరీశ్ రావు తీరు ఉందని విమర్శించారు. ధరణి మూలంగా ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించని బీఆర్ఎస్ పాలకులకు మా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు అధికారుల పక్షాన మేం క్షమాపణ కూడా అడిగానని, మీ పాలనా తప్పులకు ఏనాడైనా మీరు ప్రజలను క్షమాపణ కోరారా? అని పొంగులేటి ప్రశ్నించారు.
నెలాఖరులో భూ సమస్యల పరిష్కారం..
22ఏతో ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది కలిగిన మాట నిజమేనని అయితే ఈ వివాదాన్ని దాచిపెట్టాలనో, ప్రజలను మభ్యపెట్టాలనో నేను కానీ మా ప్రభుత్వం కానీ అనుకోవడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన వాస్తవం ఏంటో ప్రజలకు నిన్నే వివరించామని ఈ వివాదంలో జరిగిన పొరపాటును భేషరతుగా సరిద్దితామని చెప్పామని ఇప్పటికే సరిదిద్దే ప్రయత్నం మొదలుపెట్టామన్నారు. 1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ ఏర్పడి తర్వాత కూడా ప్రభుత్వ జీవోలు, మెమోలతో హక్కులు లభించిన భూములకు సంబంధించిన కాపీలు ఆన్‍లైన్ లో అప్‍లోడ్ కాలేదని, ఆ విషయం గ్రహించకుండా హైకోర్టు ఆదేశాలతో 22ఏ జాబితాను వివిధ జిల్లాల కలెక్టర్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం కారణంగా నిషేధిత భూముల సమస్య వచ్చిందని తెలిపారు. దీన్ని గ్రహించి యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ భూములు కానివాటిని కచ్చితంగా 22ఏ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపే 22ఏ భూ బాధితులు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..
ఃరెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ లోకేశ్, రాజీవ్ గాంధీతో పాటు మరో ముగ్గురితో ఇవాళ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్, స్టాంప్స్, ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్ నేతృత్వంలని ఉన్నత స్థాయి కమిటీ రాబోయే 15 రోజులపాటు ప్రతి రోజు హైదరాబాద్ కోర్ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 22ఏతో నిజమైన హక్కుదారుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ స్లాట్స్ షార్ట్ ఫాల్ అయితే వాటిని పొడిగించాలని అధికారులకు ఆదేశించామని మంత్రి పొంగులేటి వివరించారు.