సీఎం రేవంత్ కు సీనియర్లు గుత్తా, కడియంల కీలక సలహాలు!

పాలనపరమైన తప్పటడుగులతో స్వపక్షం, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ నాయకులు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..విద్యా శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కీలక సలహాలు అందించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే తన సూచనలు పాటించడం మంచిదంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Aug 29, 2026, 6:32 pm IST
Read Time: 8 mins
సీఎం రేవంత్ కు సీనియర్లు గుత్తా, కడియంల కీలక సలహాలు!

విధాత, హైదరాబాద్ : పాలనపరమైన తప్పటడుగులతో స్వపక్షం, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ నాయకులు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..విద్యా శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కీలక సలహాలు అందించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే తన సూచనలు పాటించడం మంచిదంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుత్తా పలు సలహాలు ఇచ్చారు.

కేబినెట్ లో మార్పులు చేయాలి..

ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయ్యిందని, కేబినెట్ లో మార్పులు చేస్తే పాలనలో కొత్త ఉత్సాహం వస్తుందని రేవంత్ రెడ్డికి సూచించారు. సీఎం రేవంత్ యువకుడు, ఉత్సాహవంతుడని, ఆయనకు స్వేచ్చగా పనిచేసే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పనితీరుకు ఆటంకాలు కల్పించకుండా అంతా సహరించాలన్నారు. కేబినెట్ లో, ప్రభుత్వంలో మార్పు రావాలని, ప్రస్తుత కేబినెట్ ను ప్రక్షాళన, పునర్ వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పార్టీలో క్రమ శిక్షణ లేదు అని, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలని, పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోకపోతే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. చిన్నారెడ్డి పార్టీ లైన్‌ దాటి మాట్లాడటం సరికాదు అన్నారు. పార్టీలో సమాచార లీకేజీలను నియంత్రించి క్రమశిక్షణ పెంచాల్సి ఉందన్నారు. పార్టీలో, ప్రభుత్వంలోని సమస్యలను కంట్రోల్ చేస్తే మళ్ళీ అధికారం లోకి రావచ్చు అన్నారు. పార్టీలో క్రమశిక్షణ పెంచి..పాలనపై మరింత దృష్టి పెడితే రానున్న ఎన్నికల దిశగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.

22ఏ రద్దు చేయాలి..పెన్షన్ల రూ.4వేలకు పెంచాలి

పార్టీ కేడర్ లో అసంతృప్తి ఉన్నప్పటికి..సాధారణ ప్రజలు పాలనపై సంతృప్తిగానే ఉన్నారని గుత్తా అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తునే సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే పింఛన్లను రూ.4వేలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత పథకాల భారం తగ్గించేందుకు అనర్హులను ఏరివేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం రైతు భరోసాను కొనసాగించాలని, అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ముఖ్యంగా వివాదస్పదమైన 22Aను రద్దు చేయాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-Aని రద్దు చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఉద్యమ కారులకు న్యాయం చేయాలని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేయాలని సూచించారు.

జోవో 97 ను రద్దు చేయాలి : మాజీ విద్యాశాఖ మంత్రిగా నా సలహా : కడియం శ్రీహరి

పాలిటెక్నిక్ విద్యార్ధుల ఆందోళనను అర్ధం చేసుకుని ప్రభుత్వం వెంటనే జీవో 97ను రద్దు చేయాలని మాజీ విద్యా శాఖ మంత్రిగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌తో కలిపే ఉంచాలన్నారు. జీవో 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నందున, పాలిటెక్నిక్‌ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలన్నారు. పాలిటెక్నిక్ ఎడ్యూకేషన్ ని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కిందకు తీసుకరావొద్దని స్పష్టం చేశారు. అలాచేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదనే భరోసాను ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఇంజినీరింగ్ చదివే మేము లేబర్ డిపార్ట్మెంట్ కు పోతామేమోనని విద్యార్థుల్లో అపోహలు వచ్చాయని అని తెలిపారు.

స్కిల్‌ యూనివర్సిటీకి దీన్ని అనుసంధానం చేసి పాలిటెక్నిక్‌ విద్యతోపాటు కొన్ని స్కిల్స్‌ నేర్పిస్తే వాళ్లకు వెంటనే ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వం ఆలోచన చేసిందని…కానీ విద్యార్థులంతా కూడా మేం లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లం. రేపు పాలిటెక్నిక్‌ అయిపోతే ఇంజినీరింగ్‌ పోవాల్సినోళ్లం.. వైట్‌ కాలర్ జాబ్ చేయాల్సినవాళ్లమే తప్ప మేం కిందికి పోమనే ఆలోచనలో ఉన్నారని, వాళ్ల ఆలోచన కూడా కరెక్టేనని అన్నారు. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలి. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్లడానికి లేటరర్‌ ఎంట్రీని కూడా ఉంచాలని, దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్య ఏ రకంగా ఉందో మన రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందని కడియం సలహా ఇచ్చారు. ఈ వివాదంపై నియమించిన కమిటీకి కూడా నేను ఇదే సూచిస్తున్నానని శ్రీహరి స్పష్టం చేశారు.