ఆర్టీసీ బాదుడు.. రక్షా బంధన్ వేళ చార్జీలు పెంపు

రాఖీ పౌర్ణమి రోజున ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ చార్జీల షాక్ ఇచ్చింది. సాధారణ రోజులలో చార్జీలతో పోల్చితే బస్ చార్జీలు పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపింది. పండుగల పేరుతో చార్జీలను అమాంతం పెంచితే ఎలా? అని ప్రయాణికుల ఆవేదన చెందుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి.. పురుషులకు ఈ ప్రత్యేక బాదుడు ఏంటని నిలదీస్తున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 28, 2026, 1:35 pm IST
Read Time: 3 mins
ఆర్టీసీ బాదుడు.. రక్షా బంధన్ వేళ చార్జీలు పెంపు

విధాత, హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి రోజున ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ చార్జీల షాక్ ఇచ్చింది. సాధారణ రోజులలో చార్జీలతో పోల్చితే బస్ చార్జీలు పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు లగ్జరీ బస్సు చార్జీ రూ.290 కాగా, రాఖీ పండుగ వేళ మరో రూ.110 పెంచి రూ.400 వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో నార్కెట్‌పల్లి నుంచి సూర్యాపేటకు టికెట్ రూ.80 కానీ.. రాఖీ పండుగ రోజు మరో రూ.60 పెంచి రూ.140 వసూలు చేస్తున్నారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు సాధారణ రోజుల్లో టికెట్ రూ.రూ.340 కానీ.. రక్షా బంధన్ వేళ మరో రూ.100 పెంచి రూ.440 వసూలు చేశారు. మెదక్ నుంచి నర్సాపూర్‌కు సాధారణ రోజుల్లో టికెట్ రూ.70 కానీ.. రాఖీ పండుగ రోజు మరో రూ.30 పెంచి రూ.100కి వసూలు చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి జడ్చర్లకు సాధారణ టికెట్ ధర రూ.150
కానీ.. స్పెషల్ బస్ పేరిట మరో రూ.40 పెంచి రూ.190 వసూలు చేస్తున్నారు.

పండుగల పేరుతో చార్జీలను అమాంతం పెంచితే ఎలా? అని ప్రయాణికుల ఆవేదన చెందుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి.. పురుషులకు ఈ ప్రత్యేక బాదుడు ఏంటని నిలదీస్తున్నారు. ప్రైవేట్ బస్సుల మాదిరిగా చార్జీలు పెంచితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. రాఖీ పండుగ వేళ సామాన్యుల్ని దోచుకుంటున్న ఆర్టీసీ తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.