విధాత : నేపాల జల ప్రళయంతో ఉప్పొంగిన భోటేకోశి, త్రిశూల్ నదులు సృష్టించిన విధ్వంసం భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే నేపాల్ పర్యటనకు వెళ్లిన భారతీయులలో 288 మంది జాడ తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది. ఇందులో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని తెలిపింది. నేపాల్ వరద బీభత్సంలో మరణించిన వారి సంఖ్య 389కి చేరుకుంది. ఈ జలప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విపత్తులో ఇప్పటివరకు 469 మంది మరణించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. మరో 1500 మంది గల్లంతైనట్లు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 50 మంది విదేశీయులు సహా 796 మందిని రక్షించారు.
గండక్ నదిలో కొట్టుకువస్తున్న శవాలు
నేపాల్ నుంచి భారత్ లోని యూపీలోకి ప్రవహించే గండక్ నది ప్రవాహాంలో మహారాజ్ గంజ్‌జిల్లాలో మూడు గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను సశస్త్ర సీమా బల్ సైనికులు బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సారన్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో సహాయక బృందాలు అలర్ట్ అయ్యాయి. హిమాని సరస్సు బద్దలై హిమాలయాల కొండ ప్రాంతాల నుంచి వరద నేపాల్‌ను ముంచెత్తడంతో భోటేకోశి, త్రిశూల్ నదులు ఉప్పొంగాయి. టిబెట్ సరిహద్దుల్లో నుంచి వచ్చే భోటె కోశి… త్రిశూల్ నదులు కలిసి నారాయణి నదిగా మారుతాయి. నేపాల్ నుంచి గండక్ నదిగా భారత్ లోకి ప్రవహిస్తుంది.
నేపాల్‌లోని ముస్తాంగ్ ప్రాంతంలో హిమాలయాల (నుబైన్ హిమల్ గ్లాసియర్) వద్ద ఉద్భవించి ఎగువ భాగంలో ‘కాలీ గండకీ’, దిగువ భాగంలో ‘నారాయణి’ నదిగా పిలిచే ఈ నది భారతదేశంలోకి ప్రవేశించాక ‘గండక్ నది’గా పిలుస్తారు. ఇది నేపాల్ గుండా ప్రవహించి, బీహార్‌లోని వాల్మీకి నగర్ వద్ద భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రవహించి, పాట్నా సమీపంలోని హాజీపూర్ – సోనేపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. గంగా నదికి ఎడమ వైపు ఉన్న ముఖ్యమైన ఉపనదిగా గండకీ నది కొనసాగుతుంది.