ఎక్స్‌పైరీ డేట్ ట్యాంపరింగ్ రాకెట్ గుట్టు రట్టు..ఆహార పదార్ధాలతో జాగ్రత్త!

ఢిల్లీ పోలీసులు కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ అయిన) మ్యాగీ నూడుల్స్, బోర్నవిటా, హార్లిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల తేదీలను మారుస్తూ దేశవ్యాప్తంగా అమ్ముతున్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడం సంచలనంగా మారింది. ఆగ్నేయ ఢిల్లీలోని ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలో ఓ అక్రమ ఫుడ్ ప్యాకింగ్ ఫ్యాక్టరీపై జరిపిన దాడులలో..రసాయనాలతో పాత తేదీలను చెరిపేసి, కొత్త తేదీలు ముద్రించి ఈ-కామర్స్ సైట్లలో విక్రయిస్తున్న ఎక్స్‌పైరీ డేట్ ట్యాంపరింగ్ రాకెట్ ను పోలీసులు గుర్తించారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 04, 2026, 1:47 pm IST
Read Time: 6 mins
ఎక్స్‌పైరీ డేట్ ట్యాంపరింగ్ రాకెట్ గుట్టు రట్టు..ఆహార పదార్ధాలతో జాగ్రత్త!

విధాత : ఇటీవల ఏ నగరంలో చూసినా కల్తీ ఫుడ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, డాబాలు, బేకరీలలో కల్తీ ఆహార పదార్ధాలు తనిఖీలలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తుండటం జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాము తినే ఆహారం నాణ్యమైనదో కాదో..వాటితో ఏ రోగాల పాలవుతామోనన్న ఆందోళనకు గురవుతున్నారు. ఇది చాలదన్నట్లుగా ఈ- కామర్స్ సైట్లలోనూ కాలం చెల్లిన ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న తీరు జనాన్ని మరింత కలవర పెడుతుంది.

ఎక్స్‌పైరీ డేట్ ట్యాంపరింగ్ ముఠా పట్టివేత

తాజాగా ఢిల్లీ పోలీసులు కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ అయిన) మ్యాగీ నూడుల్స్, బోర్నవిటా, హార్లిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల తేదీలను మారుస్తూ దేశవ్యాప్తంగా అమ్ముతున్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడం సంచలనంగా మారింది. ఆగ్నేయ ఢిల్లీలోని ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలో ఓ అక్రమ ఫుడ్ ప్యాకింగ్ ఫ్యాక్టరీపై జరిపిన దాడులలో..రసాయనాలతో పాత తేదీలను చెరిపేసి, కొత్త తేదీలు ముద్రించి ఈ-కామర్స్ సైట్లలో విక్రయిస్తున్న ఎక్స్‌పైరీ డేట్ ట్యాంపరింగ్ రాకెట్ ను పోలీసులు గుర్తించారు. ఆహార పదార్ధాల అసలు తయారీ తేదీ, ఎక్స్ పైరీ గడువు తేదీలను కెమికల్స్‌తో చెరిపివేసి, నకిలీ లేబుల్స్‌తో మళ్లీ ప్యాక్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మ్యాగీ నూడుల్స్, బోర్నవిటా, హార్లిక్స్‌తో పాటు థమ్స్ అప్, ఫాంటా, ఇతర పానీయాలు, నెయ్యి వంటి మొత్తం రూ.20 లక్షల విలువైన కల్తీ ఆహార ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.

‘కెమికల్ థిన్నర్’ తో తయారీ, గడువు తేదీల మార్పు.. రీ ప్యాకింగ్

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం ఏసీపీ అనిల్ శర్మ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించింది. బదర్‌పూర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), మిషన్ ముక్తి అనే ఎన్‌జిఓ సంయుక్తంగా ఓఖ్లా ఫేజ్-IIలోని మెస్సర్స్ వెస్టెయిన్డ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో ఈ సోదాలు నిర్వహించాయి. ఆ ప్రాంగణంలో బాల కార్మికులను నియమిస్తున్నారనే ఆరోపణలపై అందిన నిర్దిష్ట సమాచారం మేరకు అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే, సోదాల సమయంలో మైనర్లు ఎవరూ దొరకనప్పటికీ, ఆహార ఉత్పత్తుల తయారీ తేదీలు, గడువు తేదీలను మార్చడంలో నిమగ్నమైన ఎక్స్‌పైరీ డేట్ ట్యాంపరింగ్ రాకెట్ ను పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. తయారీ సంస్థలు ఉపయోగించే గడువు తేదీలను ‘కెమికల్ థిన్నర్’ ద్వారా తొలగించి, ప్రత్యేకమైన ప్రింటింగ్ యంత్రాలతో వాటిపై ఈ ముఠా నకిలీ తేదీలను, బార్‌కోడ్‌లను ముద్రించి రీప్యాకేజింగ్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

అక్రమ ఆహర పదార్థాల తయారీ కంపెనీ యజమానిగా దర్శన్ సింగ్ సచ్‌దేవాను పోలీసులు గుర్తించారు. అతనితో పాటు ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులను మేనేజర్ నితేష్ భరద్వాజ్, అకౌంటెంట్ నరేందర్ కుమార్, ఆపరేటర్ కపిల్, వేర్‌హౌస్ కీపర్ లక్కీ ఓఝా, మరియు సూపర్‌వైజర్లు ప్రేమ్ యాదవ్, పవన్ కుమార్ యాదవ్‌లుగా గుర్తించారు.

 

Tags: