మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,770 పెరిగి రూ. 1,44,550వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,450 పెరిగి రూ. 1,32,500కు చేరింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 పెరిగి రూ. 2,50,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jul 02, 2026, 11:32 am IST
Read Time: 4 mins
మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజులుగా తగ్గుదలను నమోదు చేస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,770 పెరిగి రూ. 1,44,550వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,450 పెరిగి రూ. 1,32,500కు చేరింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 పెరిగి రూ. 2,50,000వద్ద కొనసాగుతుంది. పసిడి ధరలకు మళ్లీ రెక్కలు రావడంతో కొనుగోలుదారులు మళ్లీ అయోమయంలో పడ్డారు. పెట్టుబడిదారులు అయితే పసిడి కొనుగోలుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వ్యాఖ్యలతో పుంజుకున్న బంగారం ధరలు

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన తాజా ప్రసంగం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పుంజుకోవడానికి బలమైన ఊతాన్ని ఇచ్చింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఈ ఏడాది కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చంటూ గత కొంతకాలంగా మార్కెట్లో సాగుతున్న ఊహాగానాలకు విరుద్దంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పసిడి మార్కెట్ ను ప్రభావితం చేశాయి. దీంతో వరుసగా రెండు రోజుల పాటు సాగిన బంగారం ధరల క్షీణతకు తెరపడి బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధర 0.6 శాతం పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు సుమారు 4,050 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇటు భారత మార్కెట్లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి.

ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్య దేశాలలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ సూచికలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి యూఎస్ ఫెడరల్కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని అంతా అంచనా వేశారు. అయితే బుధవారం పోర్చుగల్‌లో నిర్వహించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఫోరంలో ఫెడ్ ఛైర్మన్ వార్ష్ ప్రసంగిస్తూ.. అమెరికా కేంద్ర బ్యాంకు దేశంలో ధరల స్థిరత్వాన్ని కాపాడటానికి కట్టుబడి ఉందని.. ద్రవ్యోల్బణాన్ని తిరిగి దాని సాధారణ 2 శాతం లక్ష్యానికి తీసుకురావాలనే తన సంకల్పాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఫెడరల్ రేట్లు మార్కెట్ ఉహించినంత కఠినంగా ఉండబోవని తెలిపారు. వార్ష్ వ్యాఖ్యలతో వడ్డీ రేట్ల పెంపు భయాలు కాస్త తగ్గడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది.