తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా విడుదల

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. 2.64 కోట్ల మంది ఓటర్లతో జాబితా సిద్ధమైంది. 73.39 లక్షల ఓట్లను తొలగించి ముసాయిదా రూపొందించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 17, 2026, 5:52 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా విడుదల

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ముసాయిదా ఓటరు జాబితాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ (సర్‌)లో 73లక్షల మంది ఏఎస్‌డీ(ఆబ్సెంట్‌, షిఫ్ట్‌డ్‌, డూప్లికేట్‌) జాబితాలో ఉన్నారని తెలిపారు. మొత్తం 92లక్షల మందికి నోటీసులు ఇస్తామని, సెప్టెంబర్‌ 16లోపు నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని సీఈవో తెలిపారు.

2 కోట్ల 64 లక్షల 87 వేల 214 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా వెల్లడైంది. గత 2002 ఎస్‌ఐఆర్‌తో మ్యాపింగ్ కాని వారికి, సరైన వివరాలు ఇవ్వని ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ప్రక్రియలో 78.30 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 64 లక్షల 87 వేల 214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. మిగతా 73 లక్షల 39 వేల 234 ఓట్లను తొలగించి ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. ఎన్యూమరేషన్ కాని ఓట్లలో 9 లక్షల 22 వేల 230 మంది మరణించిన వారే ఉన్నారు. మరో 11 లక్షల 25 వేల 546 ఓటర్లు వారి చిరునామాల్లో అందుబాటులో లేరని సీఈవో కార్యాలయం తెలిపింది.

ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.  అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం తెలిపింది.