హైలైట్స్:
- వచ్చే ఎన్నికల్లో రేవూరిని గెలిపించాలన్న సీఎం
- కుమార్తె సుస్మిత పోటీ చేస్తుందని గతంలో మురళి ప్రకటన
- పరకాలపై కొండా దంపతుల ఆశలు గల్లంతు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కొండా దంపతులకు గట్టి షాకిచ్చారు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలంటూనే, ఆయన గెలుపు కూడా ఖాయమంటూ ప్రకటించారు. పరకాల నడిబొడ్డులో నిర్వహించిన భారీ బహిరంగ సభ సాక్షిగా ఈ ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, కొండా వర్గానికి మింగుడుపడని అంశంగా భావిస్తున్నారు. ఇలాంటి వింత పరిణామాలు, విషయాలు, చర్చలన్నీ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమంటూ సెటైర్ వేస్తున్నారు. 2023 ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పక్క నియోజకవర్గానికి చెందిన రేవూరి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవూరి ఉండగా అదే పార్టీకి చెందిన కొండా కుటుంబ సభ్యులు తమ కుమార్తె సుస్మిత వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీచేస్తుందంటూ కొమ్మాల జాతర సందర్భంగా కొండా మురళీధర్ రావు, సుస్మితలు బహిరంగంగా ప్రకటించారు. పరకాల గడ్డ తమ అడ్డా అంటూ బహిరంగ ప్రకటన చేయడం అప్పట్లో కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు ఉదాహరణగా భావించారు.
కొండా దంపతులకు చెక్
పరకాలలో పోటీపై కాంగ్రెస్ లో చర్చ ఇలాగే ఉండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో రేవూరి మరోసారి పోటీచేస్తారంటూ ఆయన గెలుపు ఖాయమంటూ ప్రకటించడం పాత సమస్యను కొత్తగా రేకెత్తించినంట్లు భావిస్తున్నారు. పరకాల పై కొండా కుటుంబం చేస్తున్న ప్రకటనకు సీఎం తనదైన పద్ధతిలో చెక్ పెట్టారని భావిస్తున్నారు. పైగా ఈ సభకు కొండా కుటుంబం దూరంగా ఉండడం గుర్తుచేస్తున్నారు. పరకాల విషయంలో అనవసరమైన రగడ లేకుండా సీఎం సూటిగా తన ప్రకటన చేశారంటూ కాంగ్రెస్ లోని ఒక వర్గం భావిస్తుండగా, కొండా దంపతులతోపాటు, వారి వర్గం మాత్రం గట్టి షాక్ కు గురైంది. ఈ ఆకస్మిక పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని భావిస్తున్నారు. ఈ ప్రకటన తమ పట్ల చిన్నచూపు చూడడంగా భావిస్తున్నారు. సీఎం ప్రకటన తర్వాత రేవూరి వర్గంలో ఆనందోత్సవాలు వ్యక్తమవుతుండగా కొండా వర్గం ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఇదిలా ఉండగా ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఏ కొత్త సమస్యకు దాని తీస్తుందోననే మరొక చర్చ కూడా అప్పుడే ప్రారంభమైంది.
సీఎం పర్యటనకు దూరంగా కొండా దంపతులు
సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సొంత జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రిగా కొండా సురేఖ దూరంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండా మురళి కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరుకావడం గమనార్హం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా సీఎం మేడారం పర్యటనలో కూడా సురేఖ కనిపించలేదు. తమ సొంత నియోజకవర్గంగా భావించే పరకాల సభకు కూడా డుమ్మా కొట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇంచార్జ్ మంత్రి పొంగులేటి, మరో మంత్రి సీతక్క, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులంతా హాజరుకాగా, కొండా దంపతులు ఎక్కడ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా కొండా దంపతులకు ఇది అలవాటేనంటూ కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకోవడం మరింత చర్చకు దారితీసింది. తన సొంత నియోజకవర్గమైన పరకాల సభకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి హాజరుకాకపోవడం మరో ఆసక్తికర రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.