SIR voter deletion|తమిళనాడులో ఎస్ఐఆర్ రగడ..97.37లక్షల ఓట్ల తొలగింపు
తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది. తమిళనాడులోనే సుమారు 97.37 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ వెల్లడించింది.
న్యూఢిల్లీ: తమిళనాడు(Tamil Nadu), గుజరాత్( Gujarat)రాష్ట్రాలలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తమిళనాడు, గుజరాత్ లలో నిర్వహించిన సర్ తర్వాత
ఆ రెండు రాష్ట్రాలలోనూ భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపుకు గురయ్యాయి. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనంతరం 1.71 కోట్ల ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేవని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఒక్క తమిళనాడులోనే సుమారు 97.37 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో ఒక్క చెన్నైలోనే 14.25 లక్షల ఓట్లు ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అర్చనా పట్నాయక్ శుక్రవారం వెల్లడించారు. సర్ తర్వాత తమిళనాడులో ఓటర్ల సంఖ్య 5,43,76,755గా ఉందని ఆమె వివరించారు. సర్‌కు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.41 కోట్లని తెలిపారు. పాత జాబితాలోని 97,37,832 ఓటర్ల పేర్లను తొలగించామని వెల్లడించారు. తొలగించిన ఓటర్లలో 26.94 లక్షల మంది మరణించిన వారి ఓట్లు కాగా, 66.44 లక్షల మంది శాశ్వతంగా వలస లేదా వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన వారి ఓట్లు అని, 3,39,278 ఓట్లు డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు.
సీఎం స్టాలిన్ ఆగ్రహం
సర్ అనంతరం ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికార డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముందు బీహార్ రాష్ట్రంలో కూడా కేంద్రం ఇదే అస్త్రాన్ని ప్రయోగించి లక్షలాది మంది నిజమైన ఓటర్లను తొలగించిందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. నా సొంత నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. కేంద్రం ఓట్ల చోరీ ఎత్తుగడలను పారనీవ్వబోమని తెలిపారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు నివేదికలు వస్తున్నాయని, వీటిలో చాలా వరకు నకిలీ ఓట్లే అని, అందుకే ఎస్ఐఆర్‌ను తమ పార్టీ సపోర్ట్ చేసిందని అన్నారు. నకిలీ ఓట్లను ఉపయోగించి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి, అధికారంలోకి రావాలనుకునే డీఎంకే కల చెదిరిపోయిందన్నారు. సర్ పై ఆందోళనలు చేస్తూ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు.
గుజరాత్‌లోనూ 73.74 లక్షల ఓట్లకు కోత
బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలోనూ సర్ ప్రక్రియ సర్ ప్రక్రియ తర్వాత 73.74 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్‌లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 42 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీంట్లో 22.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు తరలిపోగా, 8.4 లక్షల మంది మరణించారు. 2.5 లక్షల మందికి రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. 8.4 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. 2026 జనవరి 18వ తేదీ వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు వీటిని పరిశీలిస్తారని తెలిపింది. ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న పశ్చిమబెంగాల్, రాజస్తాన్, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఈ నెల 16వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తామంది. ఇక్కడ మొత్తం 12.32 కోట్ల మంది ఓటర్లు ముసాయిదాలో తమ పేర్లు ఉన్నాయోలేదో చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాను http://ceo. gujarat.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram