Tamil Nadu NDA Differences  | తమిళనాడులో ఎన్డీఏకు గడ్డు పరిస్థితులు.. అమిత్‌షా, పళనిస్వామి భిన్న ప్రకటనలు

తమిళనాడులో ఎన్నికలకు ముందుగానే ఎన్డీయేలో అధికారంలో వాటాలపై గోల దాని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నది. సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా తాము 170 సీట్లలో పోటీ చేస్తామని, మిగిలిన 64 సీట్లను భాగస్వామ పక్షాలకు కేటాయిస్తామని పళనిస్వామి చెబుతుంటే.. బీజేపీ మాత్రం అధికారంలో కచ్చితంగా తమకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నది.

  • By: TAAZ |    politics |    Published on : Jan 06, 2026 4:44 PM IST
Tamil Nadu NDA Differences  | తమిళనాడులో ఎన్డీఏకు గడ్డు పరిస్థితులు.. అమిత్‌షా, పళనిస్వామి భిన్న ప్రకటనలు

Tamil Nadu NDA Differences  | తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ.. ఆ మరుసటిరోజే.. అంటే మంగళవారం మీడియాతో మాట్లాడిన అన్నాడీఎంకే చీఫ్‌ ఎడప్పాడి కే పళని స్వామి మాత్రం తమ పార్టీ సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించడం విశేషం.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్‌షా రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా పుదుకొట్టాయిలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌ నయనార్‌ నాగేంత్రన్‌ నేతృత్వంలో ‘తమిళగామ్‌ తలాయి నిమ్ర తమిళియన్‌ పయనం’ యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు అంశంలో చర్చలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో అమిత్‌షా ఎన్డీయే కూటమి విజయంపై మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షాను తనకు ముందే నిర్ణయించుకున్న అపాయింట్‌మెంట్లు ఉన్నాయంటూ పళని స్వామి కలుసుకోలేదు. ఇద్దరు నేతల భిన్న ప్రకటనలు, అమిత్‌షాను కలుసుకునేందుకు పళనిస్వామి నిరాకరణ ఎన్డీయేలో లుకలుకలను బయటపెట్టనట్టయింది. ఇప్పటికే ఎన్డీయేను విస్తరించే ప్రయత్నాలు సాఫీగా సాగడం లేదు. ఎన్డీయే గత భాగస్వాములైన డాక్టర్‌ ఎస్‌ రాందాస్‌ నేతృత్వంలోని పీఎంకే, దివంగత విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే తాము కూటమిలో కొనసాగే విషయంలో ఇంకా తేల్చి చెప్పడం లేదు.

అయితే.. పళనిస్వామి సన్నిహితుడు, అన్నాడీఎంకేలో నంబర్‌ టూ పొజిషన్‌లో ఉన్నారని చెప్పే ఎస్పీ వేలుమణి మాత్రం తిరుచిరాపల్లిలో అమిత్‌షాను రెండు సార్లు కలుసుకోవడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఓడించడం గురించి చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా.. సీట్ల సర్దుబాటుపై పడిన పీటముడిని ఎలా పరిష్కరించాలన్న అంశంపైనే వారిరువురి మధ్య చర్చలు జరిగాయని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. వేలుమణి, అమిత్‌షా సమావేశం అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. తిరుగుబాటు నేతలను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని పళనిస్వామిని ఒత్తిడి చేసిన ఆరుగురు సభ్యుల కమిటీలో వేలుమణి ఒకరు. ఈ ఆరుగురిలో ఒకరైన కేఏ సెంగొట్టియాన్‌ ఇప్పటికే సినీ హీరో విజయ్‌ స్థాపించిన టీవీకేలో చేరిపోయారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 170 స్థానాల్లో పోటీ చేయాలని అన్నాడీఎంకే భావిస్తున్న నేపథ్యంలో అమిత్‌షాను వేలుమణి కలిశారు. 170 సీట్లలో పోటీచేస్తే సొంత మెజార్టీపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అన్నాడీఎంకే భావిస్తున్నది. ఇదే విషయాన్ని తొలిదఫా చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు పళనిస్వామి తెలియజేశారని సమాచారం. ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమేనని, కానీ, 170 సీట్లలో అన్నాడీఎంకే పోటీ చేసి, మిగిలిన 64 సీట్లను మాత్రమే ఎన్డీయే భాగస్వాములకు కేటాయిస్తామని ఆయన చెప్పారని విశ్వసనీయవర్గాల సమాచారం. ‘అధికారంలో భాగం పంచుకోవాలని బీజేపీ ఆశిస్తున్నది. కానీ.. మా నాయకుడు అందుకు అంగీకరించే ప్రసక్తే లేదు’ అని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఒకరు చెప్పారని ది వీక్‌ పేర్కొన్నది. ఎక్కువ సీట్లపై పట్టుబట్టడం ద్వార అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలైన ఓ పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్‌ వంటివారిని సభకు ఎన్నికయ్యేలా చేయాలనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.

అమిత్‌షా ఒకవైపు పార్టీ క్యాడర్‌తో కలిసి తిరుచిరాపల్లిలో పొంగల్‌ వేడుకలు చేసుకుంటుంటే.. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోనే పార్టీ శ్రేణులతో మాట్లాడిన టీటీవీ దినకరన్‌.. తమ ఏఎంఎంకే పార్టీ విజయ్‌ ఏర్పాటు చేసిన టీవీకేతో చేతులు కలిపే అంశంలో సంకేతాలు ఇచ్చారు. పన్నీర్‌ సెల్వం కూడా విజయ్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కూటమికి పళనిస్వామి నాయకత్వం వహించడాన్ని దినకరన్‌, పన్నీర్‌సెల్వం తీవ్రంగా వ్యతిరేకించి, ఆయన సీఎం అభ్యర్థిగా ఉండటాన్ని అంగీకరించేది లేదంటూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. తదుపరి దినకరన్‌, ఓపీఎస్‌ క్రమంగా టీవీకేవైపు అడుగులు వేస్తుండటం ఎన్డీయేను గట్టిగా దెబ్బకొడుతున్నది. దక్షిణ తమిళనాడులోని థేవర్‌ ఓట్‌ బ్యాంకు కోసం ఎన్డీయే ప్రధానంగా ఈ ఇద్దరు నాయకులపైనే ఆధారపడింది. ఓపీఎస్‌, దినకరన్‌ కూటమి నుంచి బయటకు వెళ్లిన విషయంలో స్థానిక బీజేపీ నాయకత్వంపై అమిత్‌ షా అసహనంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికారంలో తమకు వాటా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ను వదులుకునే ఉద్దేశంలో బీజేపీ లేదని సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

Read Also |

Tribal Cultural Revival Explained | మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం
Telangana Middle Class Housing | గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లకు 2,685 దరఖాస్తులు.. ఇదీ మిడిల్ క్లాస్ ఇండ్ల డిమాండ్‌!