పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత రూ.10, రూ.20 నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐకి అనుమతి ఇచ్చింది.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Aug 11, 2026, 4:27 pm IST
Read Time: 5 mins
పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పాలిమర్‌ కరెన్సీ నోట్ల ముద్రణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలుత ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు పార్లమెంట్‌కు తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. క్షేత్రస్థాయి ప్రయోగాల్లో భాగంగా రూ.100 కోట్ల (ఒక బిలియన్) చొప్పున రూ.10, రూ.20 డినామినేషన్ల పాలిమర్ నోట్లను జారీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

ఇది విజయవంతమైతే.. పూర్తిస్థాయిలో ఈ నోట్లను తీసుకొస్తామన్నారు.ప్రస్తుతం వీటి కొనుగోలు ప్రక్రియ ప్రాథమిక దశలో ఉన్నందున.. పాలిమర్ నోట్లను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టడానికి పట్టే కచ్చితమైన కాలపరిమితిని లేదా దానికి అయ్యే వ్యయాన్ని ఈ దశలో చెప్పడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

కరెన్సీ నోట్ల ఆయుర్దాయాన్ని పెంచడంతో పాటు నకిలీ నోట్ల ముప్పును అరికట్టడం, మన్నికను పెంచడమే పాలిమర్ నోట్ల ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. దేశంలోని విభిన్న భౌగోళిక మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్న ఐదు నగరాలను (కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా) ప్రాథమికంగా ఫీల్డ్ ట్రయల్స్ కోసం ఎంపిక చేశారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే, 2027 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను సాధారణ ప్రజా బాహుళ్యంలోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, వియత్నాం వంటి అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ నోట్లను విజయవంతంగా వినియోగిస్తుండటంతో, భారత్ కూడా ఆ దిశగా ముందడుగు వేస్తోంది.

స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్భణం

పశ్చిమాసియా సంక్షోభం, పెరిగిన అంతర్జాతీయ ఇంధన ధరలు, కూరగాయల ధరల్లో వ్యత్యాసాలు, ఎల్ నినో పరిస్థితుల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.9 శాతానికి చేరినప్పటికీ, ఇది ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితి కంటే తక్కువగానే ఉందని రాజ్యసభలో నిర్మలా సీతారామన్ వివరించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం పరోక్ష, ప్రత్యక్ష పన్నుల్లో భారీ సంస్కరణలు చేపట్టిందని మంత్రి తెలిపారు.

జీఎస్టీ 56వ సమావేశంలో 18 శాతం ప్రామాణిక రేటు, 5 శాతం మెరిట్ రేట్లతో కూడిన రెండు-రేట్ల విధానాన్ని ప్రతిపాదించడం ద్వారా అనేక వస్తువులపై పన్ను భారాన్ని హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు. దీనికి తోడు 2026 ఫిబ్రవరి నుండి అమలులోకి వచ్చేలా ఫిబ్రవరి 2026 బడ్జెట్‌లో పలు ముడిసరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని తగ్గించడమే కాక.. వంటనూనెలపై సెస్సులను, అలాగే పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి నిత్యవసరాల ధరలను అదుపులోకి తెచ్చామని చెప్పుకొచ్చారు.