• Telugu News
  • /National

మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన

మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ అనుకూలం అని, అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లునే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Apr 15, 2026, 5:39 pm IST
Read Time: 5 mins
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన

విధాత : మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ అనుకూలం అని, అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లునే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. ఖర్గే నివాసంలో మహిళా రిజర్వేషన్ల చట్టం, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై, పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించింది. రెండు గంటలపాటు సాగిన సమావేశం అనంతరం సమావేశం నిర్ణయాలను ఖర్గే మీడియాకు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపిస్తూ, ఆ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం : నిర్మలా సీతారామన్

మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనను ప్రతిపక్ష కూటమి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పందించారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతి రాజకీయ పార్టీని సంప్రదిస్తుందని స్పష్టం చేశారు. ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. డీలిమిటేషన్ బెంగాల్ ను విభజిస్తుందన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె మహిళలకు రిజర్వేషన్లను ఆపి, బెంగాల్ ప్రజల మనసుల్లో భయాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో సీట్లను 850కి పెంపు అనేది ఒక గరిష్ట పరిమితి మాత్రమే అన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది, అది అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టమూ వాటిల్లదని, ప్రతీ రాష్ట్రానికి కేటాయించిన సీట్ల సంఖ్య కూడా 50 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ కు వైసీపీ మద్దతు

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైనదిగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు అనుకూలంగా ఉందని పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేసే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు