• Telugu News
  • /Telangana

తెలంగాణలో సర్ ఓటర్ల లెక్కలు..73లక్షల ఓట్లకు కోత !

తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. 73.39 లక్షల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 11, 2026, 3:20 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో సర్ ఓటర్ల లెక్కలు..73లక్షల ఓట్లకు కోత !

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగస్టు 10వ తేదీతో ముగిసింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఉండగా..వీరిలో 2,64,87,214(78.30 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైలైజ్ అయినట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. 73,39,234 ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయామని, ఇందులో 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా గుర్తించడం జరిగిందని వెల్లడించారు.

9,22,230 మంది ఓట్లర్లు మరణించారని నమోదుకాగా, 11,25,546 మంది గైర్హాజరు/ఆచూకీ లేనివారుగా ఉన్నారని, 6,70,203 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాలలో ఓటర్లుగా నమోదైన వారుగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల సంఘం లెక్కల నేపథ్యంలో తెలంగాణలో సర్ ఎన్యూమరేషన్ అనంతరం ఓటర్ల జాబితాలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 73 లక్షలకు పైగా ఓట్లు తొలగింపుకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలలో ఆందోళన వ్యక్తం అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాల్లో మొత్తం 1.14 కోట్ల ఓటర్లు ఉండగా.. కేవలం 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్వోలకు పత్రాలు అందించారు. మిగిలిన 43.09 లక్షల మంది వివరాలు లభించకపోవడంతో ఈ ఓట్లన్నీ తొలగిపోవడం దాదాపు ఖాయమని తెలుస్తుంది.

17న ముసాయిదా జాబితా

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పూర్తికావడంతో ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ఇందులో ఎంతమంది ఓటర్లున్నారనే విషయం తేలనుంది. జాబితాలో పేరు లేకపోతే మళ్లీ ఫారం-6 నింపి ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను జత చేస్తూ ఓటు హక్కు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.