హైలైట్స్:
- కార్యకర్తల ఇళ్లలో గుట్టల కొద్దీ ఫారాలు
- తుది గడువు మరో 3 వారాలే
- చాలా ఇళ్ల గడప తొక్కని బీఎల్వోలు
- ఓటు పోతే సంక్షేమం కట్ చేస్తారా?
- ప్రజల్లో గుబులు
విధాత, హైదరాబాద్:
రాష్ట్రంలో సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) మొదలై రెండు వారాలు అవుతున్నా ఇంకా బాలారిష్టాలను దాటలేదు. ఓటరు నమోదు దరఖాస్తులు ఇంకా చాలా మందికి అందనే లేదు. ప్రతినిత్యం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక పత్రికా ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ఫారాల పంపిణీ మందకొండిగా సాగుతోందని తెలుస్తోంది. బీఎల్వోల పనితీరును సమీక్షించి, మరింత మెరుగు పర్చేందుకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమకు ఫారం అందడం లేదంటే తమకూ ఇవ్వలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ కార్యర్తలు, నాయకుల ఇళ్లల్లో ఫారాలు కుప్పలుగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బీఎల్వోలు తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికీ తిరగకుండా ఒక చోట కూర్చుని మొక్కుబడిగా పనిచేస్తున్నారని అంటున్నారు. తుది గడువు మరో మూడు వారాలు మాత్రమే ఉండగా ఇంకా ఫారాలు పంపిణీ కాలేదు. నింపిన ఫారాలు తీసుకునేది ఎప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్ -2026 లో ఓటరు గా పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తారనే చర్చ ప్రజల్లో గుబులుపుట్టిస్తోంది.
తెలంగాణలో సర్-2026 జూన్ 25వ తేదీన ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమం జూలై 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రతి రెండు దశాబ్దాలకు ఒకసారి దేశంలో ‘సర్’ నిర్వహిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. చివరి సారిగా 2002లో ‘సర్’ నిర్వహించారు. దేశంలో ఇప్పటి వరకు రెండు విడతల్లో ‘సర్’ సర్వే నిర్వహించగా, మూడో విడతలో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో చివరగా నిర్వహిస్తున్నారు.
మొత్తం 3.38 కోట్ల ఓటర్లు
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, బుధవారం వరకు 2,36,16,159 ఫారాలు పంపించినట్లు తెలంగాణ సీఈవో తెలిపారు. అయితే ఈ ఫారాలు ఓటర్ల ఇళ్ల వద్ద కాకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు, సర్పంచ్‌లు, బీఎల్‌వోలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. వాస్తవానికి బీఎల్‌వోల ద్వారా ఇంటింటికీ లేదా అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లు/ వాచ్‌మెన్‌లకు అందాల్సిన ఫారాలు నేతల వద్దకు ఎలా వెళ్తున్నాయనేది ఏ ఒక్క అధికారి ఆరా తీయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులకు వేల కొద్దీ ఫారాలు ఇచ్చి, బీఎల్‌వోలు చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు బీఎల్‌వోలు రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూర్చుని పనులు చక్కబెడుతున్నారన్న చెబుతున్నారు. తమకు ఇచ్చిన ఫారాలను ఎలా నింపాలో తెలియక వేలమంది ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఒక వేళ నింపిన తరువాత తప్పులు దొర్లితే మరో ఫారం కోసం ఆగచాట్లు తప్పవనే భయంతో మరికొందరు వేచి చూస్తున్నారు. సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం బీఎల్వోలకు ఫోన్‌లు చేస్తున్నా కొందరు స్పందించడం లేదని సమాచారం. ఒక వేళ ఫోన్ ఎత్తినా, తాము వేరే ప్రాంతంలో ఉన్నామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది.
2002 ఓటరు జాబితాలో ఉన్న వివరాల ప్రకారం కొత్తగా ఫారం నింపాల్సిన పరిస్థితిని కల్పించారు. పాత జాబితాలో పేరు, చిరునామా తప్పుగా ఉన్నవారు ఎలా పూరించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఫారంలో ఏమాత్రం తప్పు దొర్లినా ఓటు గల్లంతు అవుతుందనే భయంతో ఏ ఒక్కరు కూడా ఫారాలను నింపకుండా బీఎల్ఓల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ధైర్యం చేసి ఫారాలు నింపి అందచేస్తే, తప్పులు ఉన్నాయంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎలా నింపాలి, ఏ ఆధారాలు ఇవ్వాలనే దానిపై బీఎల్ఓలను ఎంత అడిగినా చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో తల్లిదండ్రులు, నలుగురైదుగురు కుమారులు, వారి భార్యలు ఉంటారు. తల్లిదండ్రుల నుంచి కుమారులకు ఓటు కొనసాగించేందుకు మ్యాపింగ్ చేస్తున్న బీఎల్‌వోలు.. భార్యలకు మాత్రం మ్యాపింగ్ చేసేందుకు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. భార్యల పేర్లు ఓటరు జాబితాలో చేర్చాలంటే వారి తల్లిదండ్రులు ఓటరు ఐడీని ప్రామాణికంగా తీసుకుంటామని చెబుతున్నారు. తల్లిదండ్రుల స్థానంలో భర్త పేరును పరిగణనలోకి తీసుకుని మ్యాపింగ్ చేయాలని కోరుతున్నా ఫలితం లేకపోతున్నదని సమాచారం.
చదువురానివాళ్ల గోస
వీరి సమస్య ఇలా ఉండగా, అంతగా చదువు రాని వారు గోస మరో విధంగా ఉంది. తమకు చదవడం, రాయటం రాదని, పత్రాన్ని మీరే నింపితే బాగుంటుందని పలువురు బీఎల్‌వోలను ప్రాధేయపడుతున్నారు. కానీ.. ఫారాలు ఇవ్వడం వరకు మాత్రమే తమ బాధ్యత అనే విధంగా ప్రవర్తిస్తుండడం సామాన్య ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నది. మీకు తెలిసిన వాళ్లు లేదా పక్కింటి వాళ్లతో ఫారాలు నింపి అందచేయండి, సమయం ఉంటే మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటికీ తిరిగి ఫారాలు అందచేసి, నింపిన తరువాత, సదరు ఓటరు నుంచి సంబంధ పత్రాలు తీసుకుంటామని సర్ ప్రారంభంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సీ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకారంగా హైదరాబాద్ నగరంతో పాటు పట్టణాల్లో సర్ జరగడం లేదని, ఇప్పటికీ లక్షలాది మంది ఓటర్లు ఫారాల కోసం, వాటిని నింపేందుకు సాయం చేసే బీఎల్ఓల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఎన్నికల అధికారులు ఒక సూచన చేశారు. సర్ – 2026 లో తమ పేర్లను నమోదు చేసుకోకపోయి, తప్పులను సరిదిద్దుకోకపోయినా అంతగా ఇబ్బంది పడాల్సింది లేదని అంటున్నారు. సర్ తరువాత, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ సమయంలో కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా దరఖాస్తు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచనను ఓటర్లు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు, కనీసం నమ్మే స్థితిలో కూడా లేరు.
ఓటు లేకపోతే సంక్షేమం కట్ …
ఓటు కోల్పోవడం మూలంగా అనేక సమస్యలు ఎదురవుతాయని, చిక్కులు తప్పవనే భయం, ఆందోళనలో ప్రజలు ఉన్నారు. నిన్నటి వరకు ఓటు హక్కుపై అంతగా గాబరా చెందని ప్రజలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడితో ఉన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ఓటర్లను నిద్రపట్టనివ్వడం లేదు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఓటరు జాబితాతో ముడిపెట్టాయి. పెద్ద ఎత్తున అర్హుల జాబితా నుంచి ఓటరు లేని వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఓటర్ కార్డుతో లింక్ చేయడం మూలంగా సామాజిక ఫించన్లు, ఫుడ్ సెక్యురిటీ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు నిలిపివేస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ద టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ రాజగోపాల్ పేరును సర్ లో భాగంగా తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తండ్రి ప్రముఖ గాంధేయవాది, కేరళ రాష్ట్రంలో గాంధీ స్మారక నిధి కార్యదర్శిగా పనిచేశారు. తన తండ్రి పేరును 2002 ఓటరు జాబితా నుంచి ఎలా తొలగించారో అర్థం కావడం లేదని రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. 2002 లో తన తండ్రితో పాటు తన పేరు లేదని తాజాగా నిర్వహించిన సర్ లో తన పేరును చేర్చలేదని ఆయన ఆరోపించారు. పాస్ పోర్టు రెన్యువల్ కోసం దరఖాస్తు సమర్పించి వంద రోజులు అవుతున్నా ఇంత వరకు పోలీసు వెరిఫికేషన్ కాలేదన్నారు. సర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో పాస్ పోర్టు రెన్యువల్ ఆగిపోయిందని, గత ఏప్రిల్ 17న తన కుమార్తె వివాహం కాలిఫోర్నియాలో ఉండగా, పాస్ పోర్టు రెన్యువల్ కాకపోవడంతో వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజగోపాల్ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించడాన్ని, పాస్ పోర్టు రెన్యువల్ ను నిలిపివేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఆయన పాస్ పోర్టు పునరుద్ధరించాలని కేరళ సీఎం వీడీ సతీశన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి లేఖ కూడా రాశారు.