విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను హరీష్ రావు, కేటీఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పదేళ్లూ అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించారన్నారు. రూ.8,21,651 కోట్ల అప్పులు చేసింది మీరు కాదా అని బీఆర్‌ఎస్ నాయకులను భట్టి ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రం పరువు గురించి ఆలోచించి గత ప్రభుత్వం చేసిన అప్పులను ఇన్నాళ్లూ తగ్గించి చెప్పామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ప్రజా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన అబద్ధాల పునాదులపైనే సాగిందని విమర్శించారు. హరీశ్ రావు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాననే విషయం మరిచిపోయి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన బీఆర్ఎస్ పాలకులు వేల కోట్ల బకాయిలను పెట్టిపోయారన్నారు. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ చేసిన అప్పులుకు.. గడిచిన రెండున్నరేళ్లలోనే తాము అసలు, వడ్డీలు కలిపి రూ.2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి భారీ అప్పులు కడుతూ కూడా, ప్రజా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను ప్రస్తుతం తాము రీస్ట్రక్చరింగ్ చేయిస్తున్నామని.. దీనివల్ల ఏడాదికి కట్టాల్సిన వడ్డీ భారాన్ని రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గించగలిగామని వివరించారు. కేసీఆర్, హరీశ్ రావులకు గతం లేదు.. భవిష్యత్ లేదు. అందుకే ఉనికి చాటుకోవడానికి ఇప్పుడు హడావిడి పెంచారు” అని ఎద్దేవా చేశారు.
సింగరేణి బొగ్గు మాయంపై విజిలెన్స్ విచారణ
బీఆర్ఎస్ బురద చల్లుతున్నట్లుగా సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని భట్టి స్పష్టం చేశారు. బొగ్గు మాయం ఆరోపణలపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌కు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోల్ బ్లాక్ ను సాధించుకునేందుకు ప్రస్తుతం తాము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సింగరేణిని కాపాడుకుంటూనే కార్మికుల ప్రయోజనాలను రక్షిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలకులు వారి పదేళ్ల పాలనతో సింగరేణి సంస్థను సంక్షోభంలోకి నెట్టి..మళ్లీ ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. పదేళ్ల కాలంలో సింగరేణిలో కనీసం ఒక్క కొత్త బ్లాక్‌నైనా అందుబాటులోకి తేలేదని, ఇన్నాళ్లూ కొత్త బ్లాక్లు రాకుండా అడ్డుకున్నదే బీఆర్ఎస్ నేతలు అని ఆరోపించారు.