రెండేళ్ళలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు: కేటీఆర్

రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే స్థానిక మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడతామని ప్రకటించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 10, 2026, 3:36 pm IST
Read Time: 5 mins
రెండేళ్ళలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు: కేటీఆర్

తెలంగాణకు కేసీఆర్ రెండేళ్లలో సీఎం అవుతారని, ఏ మెడికల్ కాలేజీ కోసం దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి తాపత్రయపడ్డాడో..అదే మెడికల్ కాలేజీకి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆయన పెరు పెట్టి, నర్సంపేట చరిత్రలో పెద్ది పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోమవారం నర్సంపేటలో జరిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కేటీఆర్, హరీశ్ రావు లు హాజరై పెద్దికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గొప్ప అభ్యుదయ వాది అని, పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనమే ఆయన పట్ల ఉన్న జనాభిమానానికి నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో కూడా పెద్ది కుటుంబం వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక టర్మ్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారని, ఆ టర్మ్‌లోనే కరోనా మహమ్మారి వచ్చి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని, అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన చేసిన పనులు సామాన్యమైనవి కావు అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నా అని చెప్పి.. నా చేత ప్రారంభోత్సవం చేయించారని, రూ.100 కోట్లతో వ్యవసాయ పనిముట్లు తెప్పించి రైతులకు ఇవ్వాలని ఒక పథకాన్ని తీసుకొచ్చి, బడ్జెట్‌లో లేదని కేసీఆర్ చెప్పినా.. కొట్లాడి సాధించిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.

మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ తెలంగా సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. పెద్దితో నేను పాల్గొన్న పురాతన కాకతీయ దేవాలయం పరిరక్షణ ఆందోళన చివరి కార్యక్రమం అని, అదే చివరిది అవుతుందని నేను అనుకోలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభ పెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది అని, పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో జిల్లా కాని చోట ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందంటే.. అది ఒకే ఒక్క నర్సంపేటలో మాత్రమేని,
ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితోనే సాధ్యమైంది అని గుర్తు చేశారు. పెద్ది సుదర్శన్‌పై ఉన్న ప్రేమతో.. నర్సంపేట జిల్లా కాకపోయినా 500 పడకల ఆసుపత్రిని కేసీఆర్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఇవాళ రామప్పకు, పాకాలకు, ఘనపురంకు, లక్నవరంకు దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే.. అది పెద్ద సుదర్శన్ రెడ్డి కృషి అని తెలిపారు.