మొదట పాడాల్సింది రాష్ట్ర గీతమే : తమిళ అసెంబ్లీ తీర్మానం

తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను మొదట ఆలపించడం తప్పనిసరి చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. సీఎం విజయ్ భాష, సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని పేర్కొన్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 10, 2026, 3:15 pm IST
Read Time: 6 mins
మొదట పాడాల్సింది రాష్ట్ర గీతమే : తమిళ అసెంబ్లీ తీర్మానం

తమిళనాడులో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతం ‘తమిళ్‌ తాయ్‌ వాళ్తు’ను మొదట ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అన్ని పార్టీలు బలపరుస్తూ ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ తమిళభాష ప్రాచీనత, తమిళ నాగరికతను కాపాడటమే తమ లక్ష్యం అని చెప్పారు. ‘తమిళం అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. అది మన జీవనవిధానం, మన భావోద్వేగం. తమిళ సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉన్న అనుబంధం’ అని సభలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో గీతాలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారిక వేడుకల్లో జాతీయ గీతం కంటే ముందు ‘వందేమాతరం’ పాడాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌ సర్కారు తాజా తీర్మానాన్ని తీసుకురావడం చర్చనీయాశమైంది.

తమిళ తల్లిగా ‘తమిళ్‌ తాయ్‌ వాళ్తు’ గీతం

ప్రముఖ తమిళ పండితుడు, ప్రొఫెసర్ పి.సుందరం పిళ్లై 1891లో ‘మనోన్మణియం’ అనే నాటకాన్ని రచించారు. ఆ నాటకం ప్రారంభంలో తమిళ భాషను, తమిళ నేలను ‘తమిళ తాయి’ (తమిళ తల్లి)గా కీర్తిస్తూ ‘నీరారుమ్ కడలుడుత్త’ పేరుతో పద్యాలను రాశారు. రానురాను ఇవి తమిళ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వివిధ సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల ప్రారంభంలో ఈ పద్యాలను పాడటం ఒక అనవాయితీగా మారిపోయింది. ఈ గీతం ప్రాముఖ్యతను గుర్తించిన నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి 1970 మార్చి 11న కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఈ గీతంతోనే ప్రారంభించాలని అందులో పేర్కొన్నారు. అదే ఏడాది నవంబర్ 23న దీనిపై ప్రభుత్వ ఉత్తర్వు విడుదలైంది. నాటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో దీన్ని పాడుతున్నప్పటికీ అధికారికంగా 2021లో రాష్ట్ర గీతంగా దీనికి హోదా తీసుకువచ్చారు. 2021 డిసెంబర్ 17న తమిళనాడు ప్రభుత్వం ఈ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ సభల్లో ఈ పాటను తప్పనిసరిగా ఆలపించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

వివాదంతో పుట్టుకొచ్చిన తీర్మానం

గత నెలలో రాష్ట్రంలోని మనోన్మానియం సుందరనార విశ్వవిద్యాలయం 33 వ స్నాతకోత్సవాన్ని రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాజ్తుకు బదులుగా జాతీయ గీతం ‘వందేమాతరం’తో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని మూడవ స్థానంలో ఆలపించడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో తమిళ్ తాయ్ వాళ్తును ప్రారభంలోనే ఆలపించే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన 21 మంది పార్లమెంట్ సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి (ఆర్లేకర్) కు ఉమ్మడిగా ఒక లేఖ రాశారు. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టగా అన్ని పార్టీలో ఆమోదం తెలిపాయి. దీంతో ఇకపై తమిళనాడులో అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలు తమిళనాడు రాష్ట్ర గేయంతోనే ప్రారంభం కానున్నాయి.