• Telugu News
  • /Hyderabad

టిమ్స్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సనత్‌నగర్‌లో రూ.1,100 కోట్లతో నిర్మించిన టిమ్స్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 1,082 పడకలు, 300 ఐసీయూ బెడ్లతో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Aug 17, 2026, 6:11 pm IST
Read Time: 5 mins
టిమ్స్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సనత్‌నగర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్)సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.1,100 కోట్లకు పైగా వ్యయంతో 1,082 పడకలు, 300 ఐసీయూ బెడ్లతో పాటు దేశంలోనే తొలిసారిగా AI-ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌ వసతితో కార్పొరేట్ స్థాయి సర్వీసులు అందించిన టిమ్స్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహతో కలిసి ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య మౌలిక వసతుల్లో టిమ్స్ ఆసుపత్రి సేవలు మరో కీలక అధ్యాయం అని, అధునాతన, అందుబాటు ధరల్లో సమగ్ర సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ప్రతిష్ఠాత్మక సంస్థగా టిమ్స్ నిలవనుంది. మొత్తం 22.6 ఎకరాల్లో ఐదు బ్లాకులతో ఆసుపత్రిని నిర్మించారు. అత్యాధునిక వసతులతో సిద్ధమైన టిమ్స్‌లో సుమారు 200 మంది వైద్య సిబ్బంది సేవలందించనున్నారు. టిమ్స్‌ సనత్‌నగర్‌కు మాజీ డీఎంఈ డా.ఎ.నరేంద్రకుమార్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా, మాజీ ఏడీఎంఈ డా.మహబూబ్‌ ఖాన్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రుల నుంచి తీసుకున్న వారితో పాటు ఇటీవల కొత్తగా రిక్రూట్‌ చేసిన సుమారు 200 మంది వైద్య సిబ్బంది టిమ్స్‌లో సేవలందించనున్నారు. మొదటి విడత కింద 582 పడకలను అందుబాటులోకి తెస్తూ, మిగిలిన 500 పడకలను అక్టోబర్‌ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలనే ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించడం విశేషం. సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రధానంగా నాలుగు కీలకమైన వైద్య విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నది. కార్డియాక్‌ (గుండె సంబంధిత), నెఫ్రాలజీ-యూరాలజీ (మూత్రపిండాల సంబంధిత), ట్రామాకేర్‌, ప్రత్యేకంగా అవయవ మార్పిడీ (ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌) చికిత్సలకు ఇది ప్రధాన కేంద్రంగా నిలువనున్నది. వీటితోపాటు అనుబంధంగా మరో 37 ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటు కానున్నాయి. నిమ్స్‌ తరహాలోనే స్వయం ప్రతిపత్తి (అటానమీ) హోదా కలిగిన ఈ దవాఖానకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తొలి ఐదు నుంచి ఆరేండ్లపాటు ప్రభుత్వమే గ్రాంట్ల రూపంలో నిధులు అందించనున్నది.