టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరభ్ గంగూలీ, ఆయన సతీమణి డోనా గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. తమకు ఆరు నెలలుగా ఇలాంటి లేఖలు వస్తున్నాయని గంగూలీ కుటుంబసభ్యులు తెలిపారు. మొదట్లో ఎవరో ఆకతాయిలు ఇలా చేస్తున్నారని తాము పెద్దగా పట్టించుకోని గంగూలీ దంపతులు..మళ్లీ పదే పదే బెదిరింపు లేఖలు రావడంతో పోలీసులను ఆశ్రయించారు. తాజాగా వచ్చిన లేఖలో గంగూలీ, ఆయన భార్యతోపాటు వారి సన్నిహితులకు హాని చేస్తామని బెదిరించారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ బెదిరింపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. తమకు భద్రత కల్పించాలని గంగూలీ కుటుంబసభ్యులు కోరారు. ఆ బెదిరింపు లేఖలను కొరియర్ ద్వారా పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. లేఖలో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగూలీ, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోల్ కత్తా పోలీసులు తెలిపారు.