• Telugu News
  • /National

20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు!

20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. eGFR, యూరిన్ ఆల్బుమిన్ పరీక్షలకూ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 11, 2026, 12:44 pm IST
Read Time: 9 mins
20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు!

20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ (స్థాయి సంఘం) సూచించింది. కిడ్నీ వ్యాధి లక్షణాలు తొలిదశలో స్పష్టంగా కనిపించకపోవడంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. కేవలం సీరం క్రియాటినిన్ పరీక్షకే పరిమితం కాకుండా eGFR, యూరిన్ ఆల్బుమిన్ పరీక్షలను కూడా చేయించుకోవాలని సూచించింది.మూత్రపిండాల వ్యాధికి కారణాలను అధ్యయనం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, పరిశోధనా సంస్థలను పార్లమెంటరీ కమిటీ కోరింది. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత డయాలసిస్, కిడ్నీ వ్యాధులపై ఆయుర్వేదపరంగా పరిశోధనను కమిటీ సిఫార్సు చేసింది.

దేశంలో 20 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకునేలా జాతీయ విధానం తీసుకురావాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. యువతలో కూడా కిడ్నీ సమస్యలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. చాలామంది తమ కిడ్నీలు ఎంతమేర దెబ్బతిన్నాయో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారని, ఈ ప్రమాదకర పరిస్థితికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని సూచించింది.

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధులలో క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సీకేడీ) ఒకటి అని పేర్కొంది. ముందస్తుగా వ్యాధిని గుర్తించడం, చికిత్స, దానిపై పరిశోధనకు సంబంధించి సమగ్ర విధానం రూపొందించాలని సూచించింది. కిడ్నీ జబ్బుల వైద్య సేవల్లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలున్నట్లు కమిటీ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ఆర్థికంగా వెనుకబడ్డవర్గాలు, గిరిజన తెగలు, మారుమూల ప్రాంత వాసులకు రోగనిర్ధారణ, వైద్య సేవలు అందుబాటులో లేవని తెలిపింది. ఈ అసమానతలు తగ్గించాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో వ్యాపిస్తున్న కారణం తెలియని మూత్రపిండాల వ్యాధి గురించి కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ నాన్‌ కమ్యూనికబుల్‌ డి సీజెస్‌ కింద ఈ పరీక్షలకు ఉచితంగా నిర్వహించాలని కోరింది.

కిడ్నీ జబ్బులకు ప్రధాన కారణం రక్తపోటు, మధుమేహమేనని తెలిపింది. మన దేశ యువతలో అధిక రక్తపోటు, నొప్పి నివారణ మందుల వాడకం పెరిగిందని.. క్రియాటినిన్‌తో పాటు eGFR, యూరిన్ ఆల్బుమిన్ పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచించింది. వ్యవసాయ కూలీలతో పాటు ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేవారిలో ఇది ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొంది. తీవ్రమైన ఎండవేడిమి, తరచూ డీహైడ్రేషన్‌కు గురి కావడం, పురుగుమందుల ప్రభావం, కలుషిత తాగునీరు, భారలోహాల వంటివి కిడ్నీ జబ్బులకు కారణమని.. దీనిపై శాస్త్రీయ పరిశోధన అవసరమని కమిటీ అభిప్రాయపడింది.

కిడ్నీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఎక్కువగా సీరం క్రియాటినిన్‌ పరీక్షలు చేస్తారు. కిడ్నీలు 50 శాతం దెబ్బతినేవరకు కూడా క్రియాటిన్‌ స్థాయి సాధారణంగానే ఉంటుంది. అందువల్ల క్రియాటిన్‌ ఒక్కటే కాకుండా ఈజీఎఫ్ఆర్‌ (ఎస్టిమేటెడ్‌ గ్లోమెరులర్‌ ఫిల్టరేషన్‌ రేట్‌), యూరిన్‌ ఆల్బుమిన్‌, ప్రోటీన్‌ పరీక్షలు తప్పనిసరి చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఏ ల్యాబ్‌లో క్రియాటినిన్‌ పరీక్ష చేసినా అదనపు రుసుము తీసుకోకుండా ఈజీఎ్‌ఫఆర్‌ వ్యాల్యూను రిపోర్టులో చేర్చేలా నిబంధనలు తీసుకురావాలని, సీకేడీ రోగులకు ఆరోగ్యబీమా, ఆర్థికభద్రత, తక్కువ ధరలకే రెనాల్‌కేర్‌ సర్వీసెస్‌, మారుమూల ప్రాం తాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇంటింటికీక వెళ్లి కిడ్నీజబ్బులపై అవగాహన కల్పించాలని, పాఠశాల విద్యలోనే సీకేడీపై పాఠాలుండాలని పేర్కొంది.

దేశంలో కిడ్నీ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. లక్షలాది మంది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం నుంచి క్రానిక్​ డిసీజ్​ వరకు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, హైపర్‌‌‌‌ టెన్షన్‌‌, డయాబెటిస్, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వినియోగించడం వంటివి దీనికి కారణమవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

ప్రతి వందలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఏదో ఒక స్థాయిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల తర్వాత జనం ఎక్కువగా కిడ్నీ జబ్బులతోనే ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా ఇటీవలి కాలంలో యూత్​లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం కిడ్నీ బాధితులు ప్రతి వంద మందిలో 30 శాతం మంది 35 ఏండ్లలోపు వారే కావడం గమనార్హం. కిడ్నీ జబ్బుల పట్ల అవగాహన లేకపోవడంతో మూడో, నాలుగో స్టేజ్​ దాకా కూడా సమస్యను గుర్తించలేకపోతున్నారని.. చాలా మంది పేషెంట్లు కిడ్నీలు పాడైపోతున్న దశలోనే తమ వద్దకు వస్తున్నారని నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు.చిన్న వయసులో బీపీ వచ్చిందంటే, దాదాపు కిడ్నీ సమస్యగానే భావించాలని.. కానీ ట్యాబ్లెట్లు వాడుతూ సమస్య తీవ్రమయ్యే వరకూ తెచ్చుకుంటున్నారని స్పష్టం చేస్తున్నారు.