• Telugu News
  • /Telangana

మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి వినియోగంలోకి తెస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 04, 2026, 7:12 pm IST
Read Time: 8 mins
మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ : మంత్రి ఉత్తమ్

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి వినియోగంలోకి తెస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల కంటే ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకే మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, కాళేశ్వరం బ్యారేజీలలో అన్ని లోపాలను సరిదిద్దిన తర్వాత, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల పునరుద్దరణ చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును భ్రష్టు పట్టించిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిందని, ఆ ఆస్తిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అన్నారు. మరమ్మతులు పూర్తికాకముందే బ్యారేజీలను నిర్వహించడం ప్రమాదకరమని పేర్కొన్నారు.అలా చేస్తే భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న సుమారు 40 గ్రామాల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

శాస్త్రీయ పరీక్షల అనంతరం పునరుద్ధరణ చర్యలు

బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో చేపడుతున్నామని మంత్రి వివరించారు. భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ సర్వేలు, వందకు పైగా బోర్ హోల్స్ ద్వారా నిర్మాణాల పరిస్థితిని పరిశీలిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉంచి, నీటి ఒత్తిడి లేకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు.శాస్త్రీయ పరీక్షల అనంతరం బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు ఉంటాయన్నారు. కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ (CWPRS), కేంద్ర జల సంఘం (CWC), అంతర్జాతీయ నిపుణులు కలిసి పునరుద్ధరణ నమూనాలను పరిశీలిస్తున్నారని, భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొని పంపింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.ప్రజల్లో అపోహలు సృష్టించే రాజకీయ ప్రచారాలను నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ వద్ద కనిష్ట పాండ్ లెవెల్ లేకపోవడంతో కన్నెపల్లి పంపింగ్ అసాధ్యంగా భావిస్తున్నామని తెలిపారు.

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత, నిర్వహణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవసరమైన అన్ని మరమ్మతుల అంచనాలను వెంటనే సిద్ధం చేసి పరిపాలనా అనుమతులకు పంపాలని అధికారులను ఆదేశించారు.
లైనింగ్ అవసరమైన కాలువలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల గుండా వెళ్లే ఓపెన్ కాలువలను దశలవారీగా కప్పివేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీనివల్ల చెత్త వేయడాన్ని అరికట్టడంతో పాటు పరిశుభ్రత మెరుగుపడుతుందని చెప్పారు. నాగార్జునసాగర్ దశాబ్దాలుగా నిలబడగా.. కాళేశ్వరం బ్యారేజీలు కొన్నేళ్లకే దెబ్బతిన్నదని గుర్తు చేశారు.

ప్రతి సాగునీటి పనిలో నాణ్యత, వేగం అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.గత ప్రభుత్వంలో ప్రకటించిన అనేక సాగునీటి పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భూమిపై అమలు చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

అంతకుముందు మిర్యాలగూడలో ఎగుమతులకు అనువైన ఆధునిక రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. అనంతరం గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.