న్యూఢిల్లీ : జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఈ సమావేశాల్లో దేశానికి సంబంధిచిన కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మొత్తం నాలుగు వారాల పాటు జరిగే ఈ సెషన్‌లో 19 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరగనున్నాయి.
మళ్లీ డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్ బిల్లులు
గత పార్లమెంట్ బడ్జెట్ ప్రత్యేక సమావేశాల తర్వాత జరుగబోతున్న ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టబోతుంది. దీంతో పాటు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసగా 30 రోజులకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే వారి పదవులు వాటంతట అవే రద్దయ్యేలా నిబంధనలు తీసుకొచ్చే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ బిల్లు కూడా కేంద్రం అజెండాలో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, యాంటీ-డోపింగ్ బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లుతో పాటు వేతన నియమావళి, కార్పొరేట్ లా, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో నీట్ పేపర్ లీక్ అంశంతోపాటు చమురు ధరల పెరుగుదల ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు చట్ట సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అటు ఎన్‌డీయే కూటమికి, ఇటు ప్రతిపక్ష ఇండియా కూటమి బలాబలాలో కీలక మార్పులకు వేదిక కానున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోవడం, బీజేపీ అధికారంలోకి రావడం.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది రెబల్ ఎంపీలు ఎన్‌సీపీఐలో విలీనం కావడం, ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం వంటి అంశాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీయే కూటమి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. ఈ పరిణామాలతో పార్లమెంటు ఉభయ సభలలో ఎన్డీయే బలం మరింత పెరగనుంది. మరోవైపు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకోవడంతో డీఎంకే తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు కాంగ్రెస్ సభ్యులతో సంబంధం లేకుండా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరుతూ డీఎంకే ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాసింది. ఈ పరిణామాలన్నీ సభలో ప్రతిపక్షాల ఐక్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పెరుగనున్న ఎన్డీఏ బలం నేపథ్యంలో రాజ్యాంగ సవరణల బిల్లుల ఆమోదంపై ఈ ధఫా కేంద్రం భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందుకు సంబంధించి తెరవెనుక సంప్రదింపులను సైతం కేంద్రం పూర్తి చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.