• Telugu News
  • /National

ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం

ఏఐసీసీ అత్యవసర సమావేశంలో మూడు నెలల దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టీఎంసీ విలీన వార్తలను కేసీ వేణుగోపాల్ ఖండించారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 11, 2026, 3:56 pm IST
Read Time: 3 mins
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం

ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ ఉన్నత స్థాయి అత్యవసర భేటీ ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రజా సమస్యలపై మూడు నెలల పాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఏఐసీసీ ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విలీనంపై ఎలాంటి చర్చ జరుగలేదని, విలీనం అంతా అసత్య ప్రచారం అని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరణ వ్యవహారం బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం అన్నారు. దీనిపై న్యాయపరంగా, ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి చెప్పినందునే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.

కాగా ఏఐసీసీ ఉన్నత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణమైన ప్రైవేటు కేసు విషయం లీకేజి ఎలా జరిగిందన్నదానిపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ కోవర్టులపనే అని బీజేపీ చెప్పిన అంశంపై చర్చ జరిగినట్లుగా సమాచారం.