పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాతా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటు అలజడి రేపుతుంది. ఇప్పటికే మమతా నాయకత్వాన్ని నిరసిస్తూ 80మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో… రితబ్రత నేతృత్వంలో 64మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి చీలిక వర్గంగా ఏర్పడ్డారు. 24మంది ఎంపీల్లో సైతం 19మంది ఎంపీలు కకోలీ ఘోష్ నేతృత్వంలో విడిపోయి, ఎన్డీఏ కు మద్దతునిస్తామని తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అటు రాజ్యసభలో కూడా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్ లు , ప్రకాష్ చిక్ బరైక్ లు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఎగువ సభలో మమతా బెనర్జీ పార్టీ ఎంపీల సంఖ్య కేవలం 10కి పరిమితమైంది.
టీఎంసీ చీలిక వర్గాలకు గుర్తింపు లభిస్తే..పార్టీ గుర్తు, జెండా, టీఎంసీ ఆస్తులపై హక్కులు మమతా బెనర్జీ నుంచి దూరం కానున్నాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని మమతా ఆలోచిస్తున్నారన్న వార్తలు వెలువడినప్పటికి..మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చీలిక వర్గంలో ఉన్నప్పుడు విలీనం ఎలా సాధ్యమంటూ తిరుగుబాటు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అటు బెంగాల్ పీసీసీ కూడా టీఎంసీ విలీనాన్ని వ్యతిరేకిస్తుంది. ఇదంతా ఒకటైతే..మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన వారిలో ఎంపీలు సయానీ,మాలా రాయ్ వంటి ఆమె సన్నిహితులే అధికంగా ఉండటం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
హాట్ టాపిక్ గా మారిన సయానీ ఘోష్ యూటర్న్
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీ తర్వాత భవిష్యత్ లో పార్టీకి ఆ స్థాయి నేతగా ఎదుగతారని భావించిన సయానీ ఘోష్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..మమతపై తిరుగుబాటు చేయడం బెంగాల్ రాజకీయాలతో పాటు రాజకీయ వర్గాలను విస్మయ పరిచింది. ఇంటర్ విద్యను పూర్తి చేసిన సయోనీ ఘోష్ కు సినీ నటిగా, గాయకురాలిగా జనంలో మంచి క్రేజ్ ఉంది. ఆమె వాగ్ధాటిని గమనించిన దీదీ మమతా బెనర్జీ ఆమెను పార్టీ రాజకీయాల్లో ప్రొత్సహించింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి కట్టబెట్టి నెత్తిన పెట్టుకున్నారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసన్సోల్ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, మమత ప్రోత్సాహంతో 2024లో జగదేవ్ పూర్ ఎంపీగా ఎన్నికైంది. సయోనీ ఘోష్ లోక్ సభలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై టీఎంసీ తరుపునా విమర్శల దాడిలో ముందుభాగంలో నిలిచి మరింత గుర్తింపు పొందింది. మమతా బెనర్జీని ఎవరైనా ఒక్క మాట అంటే సివంగిలా విరుచుకుపడే సయానీ ఆహార్యంతో పాటు వాగ్ధాటిలోనూ పార్టీలో జూనియర్ మమతా బెనర్జీగా గుర్తింపు పొందారు.
అసెంబ్లీఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్..
అచ్చం మమతా బెనర్జీ తరహాలో వేషధారణతో తెల్లటి చీర, సాధారణ వస్త్రధారణ, ఆహార్యంతో, హవాయి చెప్పులతో కనిపించే సయానీ ఘోష్ తన వాగ్థాటితో తృణమూల్ కాంగ్రెస్ లో వేగంగా కీలక నేతగా ఎదిగారు. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకపడే సయోనీ ఘోష్ ను ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించింది. తృణమూల్ కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సయానీ, తన వాగ్దాటి, మేనరిజంతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె సభలకు జనం, యువత భారీగా హాజరవ్వడం టీఎంసీ ప్రచారాని మంచి ఊపునిచ్చింది.
బీజేపీపై విమర్శల తూటాలు..పాటలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సయానీ ఘోష్ ప్రధానంగా… బీజేపీ దగ్గర వేల కోట్ల డబ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే..టీఎంసీకి అండగా హవాయి చెప్పులు, తెల్లచీర ధరించిన మమతా బెనర్జీ ఉన్నారంటూ పార్టీ అధినేత్రి పట్ల వీరవిధేయతను చాటుకున్నారు. ప్రచార పర్వం అంతా కూడా బీజేపీని తన పాటలు, మాటల తూటాలతో సయానీ ఘోష్ తూర్పార బట్టారు. ఓ దశలో మమతా బెనర్జీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నానని కూడా ఆకాశానికెత్తేశారు. పార్టీలో ఆమె జోరు చూసి కేడర్ లో.. మమత పీఎం అయితే , సయోనీ ఘోష్ బెంగాల్ సీఎం అవుతారు అన్నంతగా ప్రచారం సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత కూడా సయానీ ఘోష్ పార్టీ ఓటమిపై స్పందిస్తూ..మేము ఓడిపోలేదు. ఓట్ల దోపిడీ వల్ల మమతా బెనర్జీ ఓడిపోయారు. దీనికి 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు తగిన సమాధానం ఇస్తారు” అంటూ వ్యాఖ్యానించారు.
తిరుగుబాటు ఎంపీలలో సయానీ కూడా..
ఆప్ ఎంపీ రాఘవ చడ్డా బీజేపీలో చేరడాన్ని తప్పుబడుతూ..నేను ‘చడ్డా’ లాంటిదాన్ని కాదు, ‘చడ్డీ’ (లోదుస్తులు)గా మారిపోవడానికి. నేను ఘోష్‌ను.” అని తన కులాన్ని గొప్ప కులంగా చెప్పుకుంది సయానీ. తిరగేస్తే సయానీ ఘోష్ కూడా ఇప్పుడు టీఎంసీ రెబల్ ఎంపీలతో కలిసి బీజేపీ క్యాంపులో చేరిపోయింది. దీంతో ఇంతకాలం మమతా సన్నిహితురాలిగా కొనసాగుతూ బీజేపీపై సయానీ చేసిన పదునైన విమర్శలను గుర్తుచేసుకుంటు బెంగాల్ వాసులు, రాజకీయ వర్గాలు ఆమె రాజకీయ యూటర్న్ పై ఆశ్చర్యపోతున్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన సయానీ ఘోష్.. తిరుగుబాటు ఎంపీలతో చేతులు కలుపుతారని అస్సలు ఊహించలేదని టీఎంసీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటిదాక బీజేపీని, మోదీని అందరికంటే ఎక్కువగా తిట్టిపోసిన సయానీ ఇంతలోనే ఎలా ఎన్డీఏకు ఎలా జై కొడుతుందంటూ విస్మయం చెందుతున్నారు.
టీఎంసీ చీలిక వర్గం ఎంపీలు…
1. శత్రుఘ్న సిన్హా (అసన్సోల్), 2. యూసుఫ్ పఠాన్ (బహరంపూర్), 3. సయోని ఘోష్ (జాదవ్‌పూర్), 4. కకోలి ఘోష్ దస్తిదార్ (బరాసత్), 5. దీపక్ అధికారి (దేవ్) (ఘటల్), 6. సతాబ్ది రాయ్ (బీర్భూమ్), 7. రచనా బెనర్జీ (హుగ్లీ), 8. పార్థ భౌమిక్ (బారక్‌పూర్), 9. అబూ తాహెర్ ఖాన్ (ముర్షిదాబాద్), 10. ఖలీలూర్ రెహమాన్ (జంగీపూర్), 11. జగదీష్ చంద్ర బర్మా బసునియా (కూచ్ బెహార్), 12. బాపి హల్దార్ (మధురాపూర్), 13. మాలా రాయ్ (కోల్‌కతా దక్షిణ్), 14. మిటాలి బ్యాగ్ (ఆరంబాగ్), 15. కాలిపడ సోరెన్ (ఝర్గ్రామ్), 16. జూన్ మాలియా (మేదినీపూర్), 17. అరూప్ చక్రవర్తి (బంకురా), 18. డాక్టర్ షర్మిలా సర్కార్ (వర్ధమాన్ పుర్బా), 19. ప్రసూన్ బెనర్జీ (హౌరా), 20. సుస్మితా దేవ్(రాజ్యసభ), 21. సుఖేందు శేఖర్ రాయ్(రాజ్యసభ), 22.ప్రకాష్ చిక్ బరైక్ లు ఉన్నారు.