దేశంలో ఒంటరి మహిళల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళకర అంశంగా కనిపిస్తుంది. భాగస్వామి తోడు లేని ఒంటరి మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో..అందులోనూ తెలుగు రాష్ట్రాలలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు..భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే దక్షిణాదిలోనే ఎక్కువగా ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్-2024 నివేదిక వెల్లడించింది. దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు (5.4%) పురుషుల (1.6%) కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.
దక్షిణాది రాష్ట్రాలలోనే అధికం..
దేశంలో తమిళనాడు ఒంటరి మహిళల జాబితాలో మొదటి స్థానంలో, కేరళం రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడులో ఒంటరి మహిళల శాతం 11.6% ఉంది. ఇది జాతీయ సగటు 5.4% కంటే రెండింతలు ఎక్కువ. కేరళం (10.4%), కర్ణాటక (8.6%)ల్లో మహిళల్లో ఒంటరి జీవనం జాతీయ సగటును మించిపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ పురుషుల కంటే మహిళలు 4–5 రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండటమే విడాకులు, ఒంటరి జీవనానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన మహిళలు రాజీ పడి జీవించేందుకు ఇష్టపడకపోవడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. పురుషుల్లో అధిక మరణాల రేటు, మహిళలతో పోల్చితే ఆయు ప్రమాణం తక్కువగా ఉండడం వల్ల వారి భార్యలు ఒంటరిగా మారుతున్నారని విశ్లేషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి పురుషుల కంటే ఒంటరి మహిళలే ఎక్కువ
ఒంటరి పురుషుల కంటే తెలుగు రాష్ట్రాలలో ఒంటరిగా మహిళల సంఖ్య అధికంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య, పురుషులతో పోలిస్తే దాదాపు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి మహిళలు 8.0%, పురుషులు 2.1% ఉన్నారు. తెలంగాణలో మహిళలు 7.6%, పురుషులు 1.6% నమోదయ్యారు.
తగ్గిన సంతానోత్పత్తి రేటు
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) జాతీయ సగటు 1.9 కంటే తక్కువగా నమోదైనట్లు ఈ రిపోర్టు చూపుతోంది. ఒక సమాజంలో జనాభా పెరగకుండా, తరాలు సమతుల్యంగా సాగాలంటే సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 2.1గా ఉండాలి. దీన్నే స్థిరత్వ రేటు (Replacement level) అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేటు చాలా కిందకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి రేటు 1.4 కు చేరగా, తెలంగాణ టీఎఫ్‌ఆర్ 1.5గా ఉంది. అంటే జాతీయ సగటు 1.9 కంటే తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. కేరళలో 1.3, తమిళనాడు 1.3, కర్ణాటక 1.5 టీఎఫ్‌ఆర్ ఉండగా బిహార్ (2.9), ఉత్తరప్రదేశ్ (2.6) వంటి ఉత్తర భారత రాష్ట్రాలు ఇంకా అధిక సంతానోత్పత్తి రేటుతో సవాలు ఎదుర్కొంటున్నాయి.
దేశం అంతా పట్టణాల్లో…తెలంగాణలో మాత్రం పల్లెల్లో..
ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో (20.9 శాతం) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (25.6 శాతం) పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడం విచిత్రం. తెలంగాణ పల్లెల్లో 0-14 ఏళ్ల పిల్లల వాటా 19.8 శాతమే కాగా, నగరాల్లో 21.2 శాతంగా ఉంది. తెలంగాణ, ఢిల్లీ మినహాయించి దేశం మొత్తంలోనూ పట్టణాల కంటే పల్లెల్లోనే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆంధ్రలో గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ఏరియాల్లో సమానంగా పిల్లల వాటా (19శాతం) ఉంది.
ఇంకా బాల్య వివాహాల దురాచారం
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్-2024 నివేదికలో మహిళల వివాహ వయసుకు సంబంధించి కూడా కీలక అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడైంది. జాతీయ స్థాయిలో 2.1 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 6.3 శాతం, జార్ఖండ్‌లో 4.9 శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు దాదాపు సున్నా స్థాయికి చేరుకోవడం విశేషం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల సగటు వివాహ వయసు కూడా ఎక్కువగా ఉంది. కేరళలో మహిళల సగటు పెళ్లి వయసు 24.5 ఏళ్లు కాగా, జాతీయ సగటు 23.1 ఏళ్లు మాత్రమే. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం కూడా మహిళల జీవిత చక్రంపై ప్రభావం చూపుతుంది.
పట్టణ, గ్రామీణ మహిళల వివాహా వయసులో తేడాలు
శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వేలో పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య మహిళల వివాహ వయసులో తేడాలు కూడా వెలుగుచూశాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వివాహ వయసు 22.6 ఏళ్లుగా ఉంటే.. పట్టణాల్లో ఇది 24.4 ఏళ్లుగా ఉండటం గమనార్హం. విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో మహిళలు వివాహాన్ని కాస్త ఆలస్యంగా చేసుకుంటున్నారు.