Antharaganga Waterfall | హైదరాబాద్ : వర్షాకాలం ప్రారంభమైంది.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతాయి.. నిత్యం నీటి ప్రవాహంతో కళకళలాడుతుంటాయి. ఇక జలపాతాలు( Waterfall ) కూడా పాల పొంగులా పొంగిపొర్లుతాయి.. జలపాతాల అందాలను వీక్షించేందుకు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు హైదరాబాదీలు, ఇతర పర్యాటకులు తరలివెళ్తుంటారు. అంటే దాదాపు ఐదారు గంటలు ప్రయాణించి.. ఆయా జలపాతాల అందాలను వీక్షిస్తుంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగర వాసులకు ఐదారు గంటల పాటు ప్రయాణించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నగరానికి కూతవేటు దూరంలో ఓ అద్భుతమైన అంతరగంగ జలపాతం( Antharaganga Waterfall ) ఉంది. హైదరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంతరగంగ జలపాతం వివరాలు తెలుసుకుందాం.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని కావడిపల్లి గ్రామంలో ఎత్తైన గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలన్నీ రాళ్లతో నిండి ఉంటాయి. ఈ రాళ్ల మధ్యలో నుంచి అంతరగంగ జలపాతం పొంగిపొర్లుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీకి అత్యంత దగ్గరగా ఉంది అంతరగంగ జలపాతం. అంతేకాదు సమీపంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం కూడా కొలువై ఉంది.
జలపాతం వీక్షించేందుకు ఇప్పుడు వెళ్లొచ్చా..?
అంతరగంగ జలపాతం అందాలను వీక్షించేందుకు అనువైన సమయం వర్షాకాలమే. అయితే కాస్త వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాత వెళ్తే మంచిది. ఎందుకంటే జలపాతం పాల పొంగులా పొంగిపొర్లుతుంది కాబట్టి. ఇక అక్కడున్న చెట్లు కూడా ఆకుపచ్చ రూపాన్ని సంతరించుకుంటాయి. ఇది కూడా హైదరాబాదీలకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సందర్శనకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉత్తమ సమయం. అయితే కాస్త పొద్దున్నే వెళ్తే ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి..?
నగర శివార్లలో ఉన్న అంతరగంగ జలపాతానికి చేరుకోవాలంటే మొదటగా ఎల్‌బీనగర్ చేరుకోవాలి. ఎల్‌బీనగర్ నుంచి 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. అబ్దుల్లాపూర్‌మెట్ దాటిన తర్వాత సుమారు 1 కిలోమీటరకు వరకు ప్రయాణించాలి. అనాజ్‌పూర్ వద్ద ఎడమవైపున ఉన్న పెట్రోల్ బంక్ దాటగానే ఓ కాలేజీ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ఆ ప్రవేశ ద్వారం వద్ద ఎడమవైపు తిరిగి కవాడిపల్లి గుండా 2 కిలోమీటర్లు ప్రయాణించాలి. అనంతరం ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి.
30 నిమిషాల పాటు ట్రెక్కింగ్..!
ఎత్తైన గుట్టల కిందనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఇక అంతరగంగ జలపాతాన్ని సందర్శించేందుకు సుమారు 30 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సాహస యాత్రనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గుట్టలంతా నిండుగా రాళ్లు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలో నడుచుకుంటే వెళ్లాలంటే కాస్త ఇబ్బందే. ఇంకేందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి అంతరగంగ జలపాతాన్ని వీక్షించండి.