విధాత, హైదరాబాద్ : మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ ల మధ్య ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. వరుసగా ఆరు రోజుల పెరుగుదల తర్వాతా బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గుదలను నమోదు చేశాయి.
శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,850 తగ్గి రూ. 1,44,330వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,700 తగ్గి రూ. 1,32,300వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 తగ్గి రూ. 2,40,000వద్ద కొనసాగుతుంది.
తగ్గుదల తాత్కాలికమే..
గత నెల రోజుల్లో బంగారం ధరలు దాదాపు 8 శాతం మేర తగ్గినప్పటికి మార్కెట్ విశ్లేషకులు ఈ తగ్గుదల తాత్కాలికమేనని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరో 5శాతం లోపు కంటే ఎక్కువగా తగ్గబోవని స్పష్టం చేస్తున్నారు.
ఈ ధరల అస్థిరతకు ప్రధానంగా మధ్యప్రాచ్యంలో ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య, రష్యా-ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాలు కారణంగా ఉన్నాయని, అలాటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్భణం, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని అంచనా వేస్తున్నారు.
భవిష్యత్తు ధరల కదలికలపై మార్కెట్ నిపుణులు అంచనా మేరకు .. బంగారం ధరలు ఇకపై భారీగా పడిపోయే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత స్థాయిలలో ధరలు చాలా వరకు స్థిరపడ్డాయని.. ఒకవేళ తగ్గినా అది గరిష్టంగా మరో 5 శాతం పరిధిలోనే ఉండవచ్చని స్పష్టం చేస్తున్నారు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ. 1. 40 లక్షల వద్ద అత్యంత బలమైన మద్దతు లభిస్తోందని, ఆభరణాల కొనుగోలుదారులు ధరలు మరింత తగ్గుతాయని చూడకుండా.. ఈ ప్రస్తుత తగ్గుదల ధరలనే మంచి కొనుగోలు అవకాశంగా మలుచుకోవచ్చని సూచిస్తున్నారు. తమ వద్ద ఉన్న బడ్జెట్ మొత్తాన్ని ఒకేసారి వెచ్చించకుండా విడతల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
రాబోయే పండుగల సీజన్, దీపావళి నాటికి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నందున, ఆభరణాల అవసరం ఉన్నవారు ధరలు మరింత తగ్గుతాయని ఆశించకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందున్న పండుగల సీజన్, దీపావళి నాటికి బంగారం ధరల సరళిని పరిశీలిస్తే.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితులు సద్దుమణిగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.60 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఒకవేళ అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఇలాగే కొనసాగితే మాత్రం ధరలు 10 గ్రాములకు రూ. 1.40 లక్షల నుంచి రూ. 1. 50 లక్షల పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రస్తుత ధరలు కొనుగోలుకు మంచి అవకాశంగా భావించవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.