హైలైట్స్:
- నీట్ పేపర్ లీకేజీకి కేటీఆర్ గురువు
- అందుకే బీజేపీపై ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ మౌనం
- విద్యార్థులను చంపిన సంస్థకు సీబీఎస్ఈ మూల్యాంకనం
- విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే గ్లోబరీనాపై విచారణ
- చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్:
తెలంగాణలో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణానికి కారణమైన గ్లోబరీనా టెక్నాలజీస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బినామీ కంపెనీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అది తన బినామీ కంపెనీ కాదని రుజువు చేసుకునేందుకు సీసీఎస్‌లో కేటీఆర్ ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిజాలు ప్రజలకు తెలియచేస్తామని అన్నారు. గురువారం అసెంబ్లీలో మరమ్మతు పనులను శాసన సభ స్పీకర్ జీ ప్రసాద్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా కమిటీ హాలు లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. 27 మంది అభంశుభం తెలియని ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనాను బ్లాక్ లిస్టులో పెట్టకపోవడంతో కో ఎంప్ట్ ఎడ్యూటెక్‌గా రూపాంతరం చెంది, ఢిల్లీలో సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకున్నదని అన్నారు. కేటీఆర్ అప్పుడే గ్లోబరీనాను బ్లాక్ లిస్టులో పెట్టి ఉంటే సీబీఎస్ఈ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కేది కాదని, విద్యార్థులకు కష్టాలు తప్పేవి అన్నారు. ఈ తప్పిదానికి కారకుడు కేటీఆర్ అని విమర్శించారు. ఇవి మరిచిపోయి తనకు లాయర్ నోటీసులు ఇస్తానంటే బెదిరిపోతానా? అని ప్రశ్నించారు. పరువు ఉన్నోడు పరువు నష్టం దావా వేస్తే విలువ ఉంటుందని ఆయన చురకలు అంటించారు. గ్లోబరీనాతోపాటు రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధం లేదని కేటీఆర్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేస్తే నిజాలు నిగ్గుతేలుస్తామన్నారు. ఇంటర్ విద్యార్థు తల్లిదండ్రులు కూడా సీసీఎస్ లో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని, తామంత తాముగా విచారణకు ఆదేశించే పరిస్థితి లేదన్నారు. ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటే తమపై కక్ష సాధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఏడ్చే ప్రమాదముందని సెటైర్ వేశారు. గ్లోబరీనా టెక్నాలజీ మోసాలను ఆదర్శంగా తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ ను లీక్ చేయిచారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
2019 లో ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో తక్కువ మార్కులు రావడంతో పలువురు విద్యార్థులు బతుకు ఆగమైందని, ఫెయిల్ అయ్యామనే అవమాన భారంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గ్లోబరీనా మూల్యాంకనం కారణంగానే 27 మంది చనిపోయారన్నారు. దానిని బ్లాక్ లిస్టు లో పెట్టకపోవడంతో తన పేరు మార్చుకుని కోఎంప్ట్ ఎడ్యుకేషన్ గా తన పేరును మార్చుకుని ఢిల్లీ స్థాయికి చేరిందన్నారు. ఢిల్లీలో సీబీఎస్ఈ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకుని లక్షలాది మంది విద్యార్థుల బతుకు ఆగం చేసిందన్నారు. గ్లోబరీనా వెనకాల కేటీఆర్ ఉన్నారని, అందుకే ఢిల్లీలో కాంట్రాక్టు దక్కించుకుందన్నారు. ముందుగా గ్లోబరినా కుంభకోణంపై మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. చేసిన తప్పుకు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. తెలంగాణలో పదేళ్ల పాలనలో నోటీఫికేషన్లు ఇవ్వడం, కోర్టులకు వెళ్లేలా చేయడం, నియామకాలు చేయకుండా నిలిపివేశారని బీఆర్ఎస్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గ్రూప్-1 పేపర్ కూడా అమ్ముకున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో జన్వాడ పామ్ హౌస్ భూములు ఏ రాజు నుండి కేటిఆర్ కు వచ్చాయో వివరించాలన్నారు. జన్వాడ భూములు నావి కావని కేటీఆర్ ముందుకు వచ్చి సీసీఎస్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే గ్లోబరీనా కుంభకోణం, జన్వాడ ఫామ్ హౌస్ భూములపై విచారణకు ఆదేశిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబారినా మోసాలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనం, నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయం లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్మిషన్ ఇవ్వడంతో శుక్రవారం నాడు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ వాళ్లు ధర్నా చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి ఉండగా ధర్నాచౌక్ ను ఎత్తివేశారని, ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత అదే ధర్నా చౌక్ బీఆర్ఎస్ కు దిక్కయ్యిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి యుతంగా ధర్నాలు, నిరసనలు తెలుపవచ్చని, వారికే పోలీసులు అనుమతులు ఇస్తారని రేవంత్ రెడ్డి అన్నారు.
"దేశంలో ప్రస్తుత బీజేపీ ఏలుబడిలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి విలువైనది. చాలా ముఖ్యమైనది. అందుకే ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో 70 శాతం సర్ ప్రక్రియ ముగిసింది. సర్ విషయంలో ప్రజలకు అన్యాయం జరగకుండా పార్టీ కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలి. "
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హరీశ్ కు ఆరు నెలలు మంత్రి పదవి ఇవ్వలేదు…
మేడిగడ్డ బారాజ్ కూలిపోయింది వాళ్ళ ప్రభుత్వంలోనే కదా… వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపర్ డ్యాం ఎందుకు కట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తరువాత మతిభ్రమించి ఇష్టారీతిగా కాళేశ్వరం పై మాట్లాడుతున్నారన్నారు. కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి టర్మ్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు, రెండో టర్మ్ లో మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్లు మార్చి, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన విషయం మేనమామ, సీఎం కేసీఆర్ కు తెలియడంతో పదవి ఇవ్వకుండా ఆరు నెలలు పక్కన పెట్టిన విషయం ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు నెలలు మంత్రి పదవి ఇవ్వకుండా ఎందుకు కూర్చోబెట్టారనే విషయాన్ని హరీశ్ రావు సమాధానం చెప్పి కాళేశ్వరం పై మాట్లాడాలన్నారు. కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలను అమలు చేస్తున్నామని, అది కేంద్ర ప్రభుత్వంలోని చట్టబద్ద సంస్థ అని అన్నారు. మేడిగడ్డ కూలిన తరువాత ఎన్ డీ ఎస్ ఏ చైర్మన్ నాణ్యత ప్రమాణాలు ఎలా చూస్తారని అప్పటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర జలశక్తి మంత్రికి స్వయంగా పిర్యాదు చేశారని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మరిచిపోయారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులు వాళ్ళు పూర్తి చేయకపోవడంతో తాము అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా పూర్తి చేస్తున్నామన్నారు. దేవాదులను గతేడాది, ఈ ఏడాది నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆంధ్రా వాళ్ళు భద్రాచలంలో 7 మండలాలు ముంపు పేరుతో ఏపీలో కలిపితే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.
ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం రక్తం చిందించలేదు…
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా రక్తం ఇచ్చారా.. కేటీఆర్ చుట్టాలు ఎవరైనా రక్తం ఇచ్చారా..వేల కోట్లు దోచుకుని కొవ్వు పట్టిన వాళ్ళ రక్తం ఎవరైనా ఇచ్చారా..వాళ్ళు సేకరించిన రక్తం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు అందచేస్తే రోగులకు మేలు జరిగేదన్నారు. చట్టబద్ధమైన పాలన చేయడానికి నాకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. చార్లెస్ శోభరాజు, బిల్లా రంగా లు అరెస్ట్ అయ్యారు.. వాళ్ళు ఏమైనా ప్రధాన మంత్రులు అయ్యారా.. తాము అరెస్టు చేస్తే బీఆర్ఎస్ నేతలు ఏమీ కారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లో వచ్చిన ఓట్లు పార్లమెంట్ లో ఎందుకు ఓట్లు రాలేదో అందరికీ తెలిసిందేనన్నారు. బీజేపీతో లోపాయకారి ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుందున్నారు. రెండు పార్టీల మధ్య అంతర్గతంగా పొత్తు ఉందని, బయటకు మాత్రం పోట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగాల మీద అసెంబ్లీ లో చర్చ చేస్తామని, ఈ విషయంలో కేటీఆర్ నోటీసు ఇస్తే వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారం పోయిన ప్రతిసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు కాని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మోదీ పాలనలో ఓటు విలువైనది…
దేశంలో ప్రస్తుత బీజేపీ ఏలుబడిలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి విలువైనది, చాలా ముఖ్యమైనదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో 70 శాతం సర్ ప్రక్రియ ముగిసిందని, ఇంకా 30 శాతం మిగిలి ఉందన్నారు. సర్ విషయంలో ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు అలెర్ట్ ఉండాలన్నారు. బీఎల్ఓ ల కంటే గల్లి లో ఉన్న పార్టీ కార్యకర్తలు ప్రతి ఓటరును గుర్తు పడతారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో తనకు రెండు ఓట్లు ఉన్నాయంటూ పిర్యాదు చేస్తే, విచారణ చేయిస్తానని, తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని జైలులో వేయిస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో కొడంగల్ నియోజక వర్గం పరిధిలోని గ్రామాలు కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉండేదని అన్నారు. సర్ పూర్తి అయ్యేవరకు నాయకులు ఎవరు కూడా హైదరాబాద్ లో తిరగవద్దని చెప్పాను అన్నారు. సర్ పేరుతో రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర ఉందని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్లేనన్నారు. సర్ వల్ల అక్షర దోషాలు చూపిస్తూ, తప్పులు వెతికి మరీ గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ఎస్సీ, ఎస్టీల ఓట్లు తొలగిస్తున్నారన్నారు. చదువు లేకపోవడంతో వారు ఫారం లను నింపి ఇవ్వలేకపోతున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్లు ఎక్కువగా తీసివేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఓటు హక్కు లేకపోతే మున్ముందు ప్రభుత్వ పథకాలు మంజూరు కావని, ఉన్నవి తొలగించే అవకాశం కూడా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోరాటం చేస్తే 15 లక్షల ఓట్లు తిరిగి వచ్చాయన్నారు. ఓట్ల తొలగింపుకు మూల పురుషుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. బీజేపీ వాళ్లకు కేసీఆర్ కుల గురువు అని, తెలంగాణలో ఆంధ్రా వాళ్ళ 25లక్షల ఓట్లు తొలగించాడన్నారు. సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్నపుడు ఆంధ్రా ఓట్లు తొలగించారన్నారు. దేశంలో ప్రజలు ఓటు హక్కు కోల్పోతే ఆధార్ తో సహా అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు. బీజేపీ నేతల అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లను దళారులకు అమ్ముకున్నారు కాబట్టి వెళ్లగొట్టారు. పేదలకు లాభం జరుగుతుందనే అక్కసుతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఒక లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ముందుకు రావడంతో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అమెరికా కాన్సులేట్ కార్యాలయం రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు.