కేరళ అద్భుతం.. ‘తేలియాడే రహదారి’పై ప్రయాణం

కేరళలోని అలప్పుజ జిల్లా కుట్టనాడ్ ప్రాంతంలోని తేలియాడే రహదారులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్‌వాటర్స్ మధ్య నీటిపై ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించే ఈ రోడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 23, 2026, 5:29 pm IST
Read Time: 2 mins
కేరళ అద్భుతం.. ‘తేలియాడే రహదారి’పై ప్రయాణం

కేరళలోని అలప్పుజ జిల్లాలో నీటిపై తెలియాడుతున్న రహదారులు రోడ్డు ప్రయాణికులకు మంచి ఆహ్లాదకర అనుభూతిని అందిస్తూ…సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరువైపులా ఎటు చూసిన నదులు, కాలువల బ్యాక్ వాటర్, పచ్చని తాటి తోటలు, పొలాల మధ్య తేలుతున్నట్లుగా కనిపించే ఒక ఇరుకైన, వంకరటింకర రహదారిపై ప్రయాణించడం ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఈ రోడ్డు మార్గంలో వర్షాకాలంలో (ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు) నీటి మట్టం పెరిగి, రోడ్డు స్థాయికి సమానంగా వస్తుంది. దీనివల్ల వాహనాలు నీటిపై ప్రయాణిస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. వర్షాకాలంలో ఈ రోడ్ల అందాలు ఇరువైపుల బ్యాక్‌వాటర్స్, పచ్చని వరి పొలాలతో చాలా అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి.

అలప్పుజ (అలెప్పి) జిల్లాలో కుట్టనాడ్ ప్రాంతంలోని వెలియనాడ్, మంకొంబు గ్రామాలు ఈ తరహా ‘తేలియాడే రహదారులకు’ ప్రసిద్ధి చెందాయి. ఈ తెలియాడే రోడ్లు కేరళలోని నదులు, కాలువల బ్యాక్‌వాటర్, ప్రకృతి దృశ్యాలను, పర్యాటక ఆకర్షణను చాటిచెప్పే ఒక సుందరమైన మార్గంగా గుర్తింపు పొందాయి.