రెడ్కో డీజీఎం ముత్యం వెంకట రమణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో టీజీఆర్‌ఈడీసీఓ డీజీఎం ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏసీబీ గుర్తించిన ఆస్తుల నమోదిత విలువ రూ.28.14 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 23, 2026, 5:06 pm IST
Read Time: 3 mins
రెడ్కో డీజీఎం ముత్యం వెంకట రమణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టయిన తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీజీఆర్‌ఈడీసీఓ) డిప్యూటీ జనరల్ మేనేజర్ ముత్యం వెంకట రమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. బుధవారం అరెస్ట్ చేసిన అధికారులు గురువారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

2019లో ఆర్‌అండ్‌బీ శాఖలో పనిచేస్తున్న సమయంలో రూ.25 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసు ఇంకా విచారణలో ఉండగానే, తాజా దాడుల్లో రూ.28.14 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లు వెల్లడించింది. నమోదిత విలువ ప్రకారం ఆస్తులు రూ.28.14 కోట్లు కాగా, ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ కావడంతో మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఏసీబీ ఆరున్నర దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కేసుగా అధికారులు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారమే రూ.17.94 కోట్లతో చిక్కిన ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌ ఉదంతమే ఇప్పటివరకు రికార్డు కాగా.. తాజాగా టీజీ రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ ఆ రికార్డుని బద్దలు కొట్టాడం విశేషం.