• Telugu News
  • /Telangana

టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంటితో పాటు 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భారీ ఆస్తులు, నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 22, 2026, 12:09 pm IST
Read Time: 3 mins
టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలంగాణలోని రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో మాదాపూర్​లోని వెంకటరమణ ఇళ్లు సహా 10 ప్రాంతాల్లో 8 బృందాలతో సోదాలు చేస్తోంది. ఈసందర్భంగా మాదాపూర్‌లోని వెంటకరమణ ఇంటితో పాటు మరో 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. డీఎస్పీ మాజిద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.హైదరాబాద్​ తో పాటు ఖమ్మంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

సోదాలలో స్థిర, చరాస్తి పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు, జీ ప్లస్​ 3 కమర్షియల్ భవనాలు, ఆంజనేయ నగర్ మూసాపేటలో జీ ప్లస్​ 5 కమర్షియల్ బిల్డింగ్, ఖానాపేట్, గుట్టల బేగంపేట్​లో నగదు పత్రాలు, గోల్డ్​ అండ్ డైమండ్ జ్యువెలరీ, విదేశీ మద్యం సీసాలు గుర్తించారు. వెంకట రమణ భార్య స్వప్న పేరుపై నిర్మాణంలో ఉన్న 10 ప్లాట్లను గుర్తించామని ఏసీబీ అధికారులు వివరించారు. ఆంజనేయనగర్ మూసాపేటలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.

కియా, మహీంద్రా, బెలినో కంపెనీలకు చెందిన ఫోర్​ వీలర్​ వాహనాలు గుర్తించారు. వీటి విలువ లెక్కించి వెల్లడిస్తామన్నారు. సోదాల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ముత్యం వెంకట రమణ డిప్యూటేషన్ పై రెడ్కోలో ఉన్నారని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

వెంకటరమణ గతంలోనూ ఏసీబీకి చిక్కారు. 2019లో ముత్యం వెంకటరమణపై జరిగిన ఏసీబీ ట్రాప్​ కేసులో రూ.26 లక్షలు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.