తెలంగాణ ఏసీబీ శాఖ దాడులలో రూ. 100కోట్లకు పైగా అక్రమాస్తులు పొగేసిన మరో అవినీతి తిమింగలం రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆట కట్టింది. రంగారెడ్డి జిల్లా ఆర్డీవో కార్యాలయంో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (తహశీల్దార్ కేడర్) శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. మొత్తం 15 ప్రాంతాల్లో జరిపిన ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులను గుర్తించారు. రూ.4 లక్షలు నగదుతో పాటు రూ.6.87 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్‌చేసి నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.
శ్రీనివాస్‌రెడ్డిపై గతంలోనూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ తెలిపింది. 2009లో మహేశ్వరం మండల తహశీల్దార్ ఆఫీసులో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయనపై డీఏ కేసు నమోదైంది. తాజాగా మరోసారి భారీగా ఆస్తులు గుర్తించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. లంచం తీసుకుంటూ ఓసారి ఏసీబీకి చిక్కినా మారకుండా..మళ్లీ ఉద్యోగంలో చేరి అందినకాడికి అక్రమ వసూళ్లకు పాల్పడటం అధికారులను విస్మయపరిచింది. ఏసీబీ కేసులు జీవితాంతం తేలేవి కావన్న ధీమాతో అవినీతి చేపలు తిమింగలాలుగా మారుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి.
శ్రీనివాస్ రెడ్డి అక్రమాస్తుల చిట్టా..
శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి వద్ద కిలోకు పైగా బంగారం, ఆయన 7 బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 8 ప్లాట్లు, యాచారంలో 10 ఎకరాల భూమితో పాటు హస్తినాపురంలో మూడంతస్తుల భవనం ఉన్నట్లు తెలిసింది. శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.4 లక్షలు, 3 కార్లు, 3 ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఓ బారులో కుమారుడి పేరిట రూ.86 లక్షలు పెట్టుబడి కూడా పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు
కర్మన్‌ఘాట్‌లో రూ.2.63 కోట్లు విలువ చేసే రెండు ప్లాట్లు, కర్మన్‌ఘాట్‌లో G+3 పెంట్‌హౌస్ విలువ రూ.1.61 కోట్లు, యాచారం నల్లవెల్లిలో 10 ఎకరాల 08 గుంటల వ్యవసాయ భూమి, నగర పరిధి, శివార్లలో 8 ఖాళీ స్థలాలు, బాలాపూర్‌లోని నరేంద్ర బార్ & రెస్టారెంట్‌లో పెట్టుబడులు.. వాటా రూ.86 లక్షలు, రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ తహశీల్ధార్ గాపనిచేశారు. శ్రీనివాసరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఏసీబీ డీఎస్పీ చెప్పారు.