బీఆర్ఎస్‌లో తగ్గని ‘బీటీ బ్యాచ్’ హవా! వాళ్లకే ఇన్‌చార్జ్‌ పగ్గాలు

ప్రతిపక్ష బీఆరెస్‌లో మరోసారి బీటీ బ్యాచ్‌ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్వేరు పార్టీల్లో ఉన్నవారు బీఆరెస్‌ గూటికి చేరారు. అక్కడితో ఆగకుండా.. ఉద్యమకాలం నాటి నేతలను మించిన ప్రయారిటీ దక్కించుకున్నారు. దీంతో అప్పటి నుంచే వారి వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీని పునర్నిర్మించుకునే పనిలో చేపట్టిన సభ్యత్వాలు, ఇతర కార్యక్రమాలకు సైతం ఎక్కువ మంది బీటీ బ్యాచ్‌ నేతలను ఎంపిక చేయడం బీఆరెస్‌ శ్రేణుల్లో విమర్శలకు తావిస్తున్నది.

బీఆర్ఎస్‌లో తగ్గని ‘బీటీ బ్యాచ్’ హవా! వాళ్లకే ఇన్‌చార్జ్‌ పగ్గాలు
  • సభ్యత్వ నమోదు, సంస్థాగత బాధ్యతలు.. జిల్లాలకు ఇన్‌చార్జ్‌ల ఎంపికతో బహిర్గతం
  • ఉద్యమకారులకు మరోసారి చుక్కెదురు
  • కనువిప్పుకలుగని బీఆర్ఎస్ నాయకత్వం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ దే హవా కొనసాగింది. ఇప్పుడు కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. తాజాగా పార్టీ సంస్థాగత బలోపేతానికి జిల్లాలవారీగా నియమించిన ఇన్‌చార్జ్‌లలో బీటీ బ్యాచ్ కే బాధ్యతలు కట్టబెట్టారని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. గతంలో కూడా పార్టీ ప్రధాన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు.. కవిత కూడా ఈ బీటీ బ్యాచ్ కే పెద్ద పెద్ద పీటలు వేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలో… ప్రభుత్వంలో ఈ బీటీ బ్యాచ్ చెప్పిందే వేదంగా సాగింది. పదేండ్లు పట్టపగ్గాలు లేకుండా పాలన కొనసాగించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతో భవిష్యత్తు, ఉద్యమ చరిత్ర సొత్తుగా ఉండి.. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో నిర్మాణమైన పార్టీ పదేండ్లకే పేకమేడలా కుప్పకూలింది. దీనికి ప్రధాన కారణాల్లో ‘బీటీ బ్యాచ్’కు ప్రాధాన్యమివ్వడం కూడా ఒకటనే చర్చ ఇప్పటికీ బలంగా ఉంది. విచిత్రం ఏమిటంటే.. ఇప్పటి వరకు చేసిన తప్పులు, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పార్టీని నిర్మాణాత్మకంగా, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యల్లో కూడా మళ్లీ అదే బీటీ బ్యాచ్ ఆధిపత్యం వహిస్తున్నదనే చర్చ తాజాగా వినిపిస్తున్నది. దీని వల్ల భవిష్యత్తులో మళ్లీ పార్టీకి అంతర్గతంగా ఇబ్బందులు రానున్నట్లు భావిస్తున్నారు.

ఇన్‌చార్జ్‌ల నియామకంపై విమర్శలు మొదలు

మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థాగత నిర్మాణానికి జిల్లాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ నియామకంపై అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి. అధికారం కోల్పోయి, పార్టీ క్షేత్రస్థాయిలో కళతప్పినప్పటికీ ఇంకా పార్టీ ప్రధాన నాయకత్వానికి కనువిప్పు కలుగలేదనే విమర్శలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శులే కాకుండా కొద్ది మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన జిల్లాల ఇన్‌చార్జ్‌లుగా కూడా వారిని నియమించారు. నియామకంలో బీటీ బ్యాచ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వలేదనే చర్చ సాగుతోంది.

వీరే ఇన్‌చార్జ్‌లు

జిల్లాలవారీగా నియమించిన ఇన్‌చార్జ్‌ల వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ రావుకు అప్పగించారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు మొన్న పార్టీలో చేరిన మాజీ మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డికి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్‌కు, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు – ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డికి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు – ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లుకు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి – గంగాధర్ గౌడ్‌కు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు – మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ రావుకు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు – ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డికి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు మాజీ మంత్రి మహమూద్ అలీకి, గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ కు, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలు ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి, హైదరాబాద్ జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు అప్పగించారు.

ఉద్యమకారులు నలుగురైదుగురే

ఇందులో నలుగురైదుగురుకు మించి కూడా ఉద్యమకారులు లేరు, ఇక పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు వేళ్ళ మీద లెక్కించే వారున్నారు. మిగిలిన వారంతా 2014 తర్వాత, 2018 తర్వాత వచ్చిన వారేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని ఈ స్థితికి తెచ్చిన బంగారు తెలంగాణ బ్యాచ్‌కే మళ్ళీ పెద్ద పీట వేశారని అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సీనియర్ నాయకులెంతో మంది ఉన్నప్పటికీ వారికి కనీస అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బూత్ స్థాయి నుంచి శిక్షణ

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నందున బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కూడా అదే పద్ధతిలో జరపాలని ముఖ్యుల సమావేశంలో నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ప్రతి మండలాన్ని, మున్సిపల్ బాడీల వారీగా, ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లో నియమించాలని నిర్ణయించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో, బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, ఈ శిక్షణను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయించారు.

బీటీ బ్యాచ్ లక్ష్యం ‘అధికారం’

బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ అంటే రాష్ట్రంలో తెలువని వారు లేరంటే అతిశయోక్తి లేదు. బీటీ బ్యాచ్ అనే పేరు రాష్ట్రంలో ఎంతో పాపులర్ అయ్యింది. ఈ బీటీ బ్యాచ్ కు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారనే అపవాదు ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే బీటీ బ్యాచ్, యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచ్ అనే చర్చలేకుండా ముందుకు సాగే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన అప్పటి టీఆర్ఎస్ పద్నాగేళ్ళ పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించింది. జూన్ 2, 2014న అధికారికంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. దీనికి ముందే పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజుల వ్యవధిలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఇక నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా కొనసాగుతోందంటూ ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రకటనను ఎవరూ అంత పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఉద్యమపార్టీగా ముద్రవేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఆ ముద్ర తొలగించి ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతోందని భావించారు. తొలి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లో పార్టీలో కొత్త పొకడలకు తెరతీశారు. స్థిరమైన ప్రభుత్వం, ఆంధ్రా వాళ్ళ కుట్రల పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. చివరికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో పాటు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, చివరికి కమ్యూనిస్టు పార్టీల ముఖ్యనాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ వాదుల పై దాడులు చేసిన వారిని, పచ్చి తెలంగాణ వ్యతిరేకులను సైతం పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారికి పెద్ద పీట వేస్తూ భుజాలకెత్తుకోవడంతో పార్టీలో అంతర్గతంగా ఒక కుదుపు ఏర్పడింది. ఈ పరంపర రెండవ సారి అధికారంలోకి రావడంతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇలా చేరిన వారినే బంగారు తెలంగాణ బ్యాచ్ గా పేర్కొన్నారు. దాదాపు అన్ని స్థాయిల్లో… ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులుగా ఈ బీటీ బ్యాచ్ పార్టీ పై పట్టు సాధించింది. 2014 ఎన్నికలకు ముందు వరకు పార్టీలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ వస్తున్న ఉద్యమ నాయకులొక్కరికి చెక్ పెడుతూ వచ్చారు. ఉద్యమ నాయకుల్లో కొందరికి అవకాశాలు రాగా, మిగిలిన వారు పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీలో, బయట విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం అధికారం కోల్పోయి మూడేళ్ళు కావస్తున్న సందర్భంగా పార్టీ నిర్మాణం పై కేంద్రీకరించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టానికి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించగా.. వాటిలోనూ బీటీ బ్యాచ్‌దే అధిక్యమన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యమ కారులకు తిరిగి ప్రాధాన్యం దక్కుతుందనే భరోసా ఇప్పట్లో లేదని తేలిపోతున్నదని వాపోతున్నాయి. ఇప్పటికే సాంత పార్టీలో ఈ అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుండగా, కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ ఉద్యమ కారుల సంఘాల నుంచి ఈ విమర్శలు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పై విమర్శలు వెల్లువెత్తే అవకాశముందంటున్నారు.

Read Also |

Apple Farming | కరువు నేలలో ఆపిల్ సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహారాష్ట్ర రైతు!
I Bomma | టాలీవుడ్‌కు మళ్లీ పైరసీ ముప్పు.. తిరిగి యాక్టివ్ అయిన ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లు
Chicken Price | కొండెక్కిన కోడి కూర ధ‌ర‌.. కిలో రూ. 350 పైనే..!
జైలు కెళ్లి చూస్తారా…రూ.1000 స్కీమ్