సీనియర్ కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వహించిన నల్లగొండ బహిరంగ సభ ఆ పార్టీకి…జిల్లా అభివృద్ధికి ఏం మేలు చేసిందన్న ప్రశ్నతో పాటు పార్టీలోని అంతర్గత అసమ్మతిని తెరపైకి తెచ్చింది. సభలో ప్రసంగించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రసంగంలో నల్గగొండ కార్పోరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు, షాది ఖానాకు 30 కోట్ల రూపాయలు, ఏఎమ్ఆర్పీ లైనింగ్ పూర్తి చేసేందుకు మరో 500 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాగార్జు సార్ హైలెవ, లోలెవల్ కెనాల్స్ అనుసంధాన కాలువలకు నిధులు మంజూరు చేయాలని, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులకు సంబంధించి తమ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న భూసేకరణక నిధులు మంజూరీ చేయాలని, మిర్యాలగూడలోని దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, తోపుచర్ల ఎత్తిపోతల పథకలాకు నిధుు కేటాయించి పనులు పూర్తి చేయాని విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం తన ప్రసంగంలో వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేస్తామని చెప్పి…వెంకట్ రెడ్డి, రఘువీర్ రెడ్డి అడిగిన పనులకు సంబంధించి నిధుల మంజూరు ఊసెత్తకపోవడం విస్మయకరం. సీఎం ప్రసంగం ఆసాంతం బీఆర్ఎస్ టార్గెట్ గా సాగడం.. జిల్లా సమస్యలపైన, నిధుల విడుదలపై సీఎం నుంచి స్పష్టత రాకపోవడం చివరకు పార్టీ శ్రేణులను సైతం నిరాశ పరిచింది.
మంత్రులకే నిధులా..?
జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డిల నియోజవర్గాలకే నిధులు ఎక్కువగా మంజూరవుతున్నాయని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులిచ్చేలా దృష్టి సారించాలంటూ సభా వేదిక మీదుగా ఎంపీ రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండలోని ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు మినహా తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్మథనానికి నిదర్శనంగా నిలిచాయన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో ఇదే తరహాలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నారు.
డీసీసీ అధ్యక్షుడిని మంత్రి దూరం పెట్టినా..ఆదరించిన సీఎం
తన అభిష్టానికి వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షుడిగా నియామితులైన పున్నా కైలాష్ నేత పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన ఆహ్వాన ప్లెక్సీలలో సైతం పున్నా కైలాష్ నేత ఫోటోను పెట్టించకుండా వెంకట్ రెడ్డి, ఆయన వర్గీయులు దూరం పెట్టారు. అయితే పున్నా కైలాష్ ను సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై గుర్తించి తన ప్రసంగం ప్రారంభంలో ఆయన పేరును ప్రస్తావించారు. తాము వ్యతిరేకించే పున్న కైలాష్ పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంతో పాటు సీఎం గన్ మెన్లు నల్లగొండ కార్పోరేషన్ చైర్ పర్సన్ బుర్రి చైతన్య భర్త శ్రీనివాస్ రెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం సహజంగానే మంత్రి వెంకట్ రెడ్డి వర్గీయులను ఆగ్రహానికి గురి చేసింది.
గుత్తా-వెంకట్ రెడ్డిల మధ్య రచ్చకెక్కిన విబేధాలు
సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనకు సంబంధించిన అధికారికంగా విడుదలైన మీడియా యాడ్స్ లలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోను విస్మరించడం పట్ల గుత్తాతో పాటు ఆయన వర్గీయులను చిన్నబుచ్చింది. ఇదంతా కూడా నల్లగొండ నియోజకవర్గం, జిల్లా రాజకీయాల్లో గుత్తా, వెంకట్ రెడ్డిల మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే చోటుచేసుకుందంటూ వెంకట్ రెడ్డి వైఖరిపై గుత్తా వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదికాకుండా నల్గగొండ సభా వేదిక నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కూడా ఆయన వర్గీయులకు ఆగ్రహాన్ని తెప్పించింది.
సీఎం సభకు మరోసారి రాజగోపాల్ రెడ్డి దూరం
ఎప్పటిలాగే మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సభకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. తన సోదరుడు మంత్రి వెంకట్ రెడ్డి నిర్వహించిన సభ అయినప్పటికి రాజగోపాల్ రెడ్డి ఈ సభకు గైర్హాజరుకావడం కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. తనకు మంత్రి పదవి ఇవ్వడంతో జరుగుతున్న జాప్యం పట్ల అసహనంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ సభకు దూరంగా ఉండటం ద్వారా మరోసారి తన అసంతృప్తిని బాహటంగా వెళ్లగక్కారని రాజకీయ విశ్లేషకులు, పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ..పునర్ వ్యవస్థీకరణ చేస్తామని..మంత్రి పదవి దక్కబోతుందని ఊరించి.. ప్రతిసారి ఉసురుమనిపిస్తుండంతో సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి అసహనంతో రగిలిపోతున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవి హామీ అమలు కాకపోవడం వెనుక రేవంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని ఆయన భావిస్తుండటంతో సీఎం సభలకు దూరంగా ఉండటంతో పాటు తరచూ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. ఇదే క్రమంలో సీంఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభకు రాజగోపాల్ రెడ్డి మరోసారి గైర్హాజరైన వైనంతో వారి మధ్య ఉన్న దూరం మరోసారి బహిర్గతమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభ..ఆ పార్టీలోని అంతర్గత లుకలుకలను బహిర్గతం చేసిన వేదికగా మిగిలిందన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.