ఖమ్మం నుంచి హైదరాబాద్ కు మారిన రైతు భరోసా సభ

వర్షాల కారణంగా ఖమ్మంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభను హైదరాబాద్ శిల్పారామానికి మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 29, 2026, 2:13 pm IST
Read Time: 4 mins
ఖమ్మం నుంచి హైదరాబాద్ కు మారిన రైతు భరోసా సభ

ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభా వేదికను హైదరాబాద్ నగరానికి మర్చారు. ఈ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల చేయాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా సభావేదిక ను ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రేపు సాయంత్రం 4 గంటలకు శిల్పారామం వేదికగా నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. పెట్టుబడి సాయం పంపిణీకి రూ. 9 వేల కోట్లను జులై 15లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు.. కోటి 50 లక్షల ఎకరాలకు.. ఎకరాకు 6 వేల చొప్పున జమ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు మొత్తం 10–15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఉద్యోగుల బకాయిలకు రూ. 2 వేల కోట్లు , వారి శాలరీలు, పెన్షన్లు, ఆసరా పింఛన్లు ఇవ్వనున్నందున క్షేత్రస్థాయిలో ఎక్కడా నగదు కొరత రాకుండా చూసేందుకు, బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది.

జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతోంది. సాధారణంగా వచ్చే.. నెలవారీ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు రూ. 6 వేల కోట్లతోపాటు రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలులాంటి ఇతర ముఖ్యమైన పథకాలను కలుపుకొని జులై ఒక్క నెలలోనే దాదాపు రూ.20వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

ఇంతటి భారీ మొత్తాన్ని ఒకేసారి సర్దుబాటు చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఆర్‌బీఐ నుంచి సుమారు రూ.11,500 కోట్ల మేర రుణం సేకరించడంతోపాటు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయ వనరులను (స్టేట్ ఓన్ రెవెన్యూ) కూడా దీనికి తగ్గట్టుగా మళ్లించనున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా లభించే నిధులను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జులై నెల ఖర్చులను అధిగమించేందుకు ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోందని సమాచారం.