తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సరికొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ జారీకి శ్రీకారం చుట్టబోతుంది. సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పనలో భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ కార్డులపై ముందు భాగంలో సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు.. రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబర్ వంటి కీలక వివరాలు పొందుపరిచారు. సివిల్ సఫ్లయ్ కమిషనర్ సంతకానికి కార్డులో స్థానం కల్పించారు.
తొమ్మిది సెక్యూరిటీ ఫీచర్లతో కార్డుల తయారీ
ఈ కార్డులను ఎవరూ ఫోర్జరీ చేయకుండా, నకిలీవి తయారు చేయకుండా మొత్తం 9 రకాల ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. పాస్‌పోర్టులు, బ్యాంకు నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల ముద్రణలో ఉపయోగించే భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల తయారీలో వాడారు. కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించడంతోపాటు లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌గా ధ్రువీకరించేందుకు వీలుగా మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నమూనాను రూపొందించింది.
తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన సురక్షిత హోలోగ్రామ్, కార్డు రెండు వైపులా కనిపించి కనిపంచని రీతిలో స్పర్శతో గుర్తించే ‘Government of Telangana’ ఎంబోస్డ్ అక్షరాలు, మాగ్నిఫికేషన్‌లో మాత్రమే కనిపించే అతిచిన్న మైక్రో టెక్ట్స్ ఉన్నాయి. ఇవి భూతద్దంతో చూస్తేనే తప్ప స్పష్టంగా కనిపించవు. సాధారణ ప్రింటింగ్ పద్దతిలలో వీటిని యథాతథంగా డూప్లికేట్ చేయడం, కాపీ చేయడం కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు. కార్డు బ్యాక్ గ్రౌండ్ లో గిల్లోష్ ప్యాటర్న్ అనే క్లిష్టమైన రేఖాకృతిని వాడారు. ఇది ఫోర్జరీని అడ్డుకునేందుకు..కార్డులోని ఇతర సెక్యూరిటీ ఫీచర్స్ తో కలిపి ఇది అదపన లేయర్ గా ఉపయోగపడుతుంది.
యాంగిల్ మార్చితేనే కనిపించే అక్షరాలు..
స్మార్ట్ రేషన్ కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘జీవోటీజీ’ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట యాంగిల్(కోణం)లో లేదా మాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించారు. దీంతో కార్డు ఒరిజినాలిటీని పరిశీలించేందుకు అదనపు అవకాశం లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్‌మార్క్‌ను కార్డులో పొందుపరిచారు. సాధారణ కంటికి కనిపించని యూవీ (అల్ట్రా వయొలెట్) లోగోను ప్రత్యేకంగా ముద్రించారు. యూవీ రేస్‌లో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది. కార్డు నిజమైనదా? డూప్లికేట్‌దా? అనే విషయాన్ని త్వరగా నిర్ధారించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనున్నది.
ఎన్‌క్రిప్టెడ్ క్యూ ఆర్ కోడ్‌తో డిజిటల్ ధ్రువీకరణ
కార్డు వెనుక భాగంలో 20×20 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఇందులో డిజిటల్‌గా సేఫ్టీ సమాచారాన్ని పొందుపరచి, అథరైజ్డ్ సాఫ్ట్‌వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించేలా వ్యవస్థను రూపొందించారు. డేటాలో అనధికార మార్పులు, డూప్లికేట్ కార్డుల ప్రక్రియను నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశం. రేషన్ కార్డుల దుర్వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ స్మార్ట్ కార్డుల విధానంపై ప్రజల స్పందన ఎలా ఉండనుందో త్వరలోనే తేలనుంది.
1.6 కోట్ల స్మార్ట్ కార్డుల పంపిణీ : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో 1కోటి 6 లక్షల స్మార్ట్ కార్డుల పంపిణీ ఆగస్టు 15నుంచి ప్రారంభవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా 20లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, దీంతో కొత్తగా 63లక్షల మంది లబ్ధిదారులు రేషన్ పరిధిలోకి రానున్నారని, మొత్తం 3 కోట్ల 42 లక్షల మందికి రేషన్ కార్డుల పరిధిలో ఉంటారని వెల్లడించారు. ప్రతినెలా 2.16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని, గతంలో 90% రేషన్ బియ్యాన్ని అమ్ముకునేవారు అని, ఇప్పుడు 100% సన్న బియ్యాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. రేపటి నుంచి 15 రోజులు పాటు 12 నియోజకవర్గాలలో, మండలాలలో, పట్టణాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ కొనసాగుతుందని వివరించారు.
ప్రధాని ఫోటో లేకపోవడంతో బీజేపీ అభ్యంతరం
తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులలో ప్రోటోకాల్ మేరకు ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోవడం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రానిదే సింహభాగమని అలాంటప్పుడు ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదంటూ నిలదీశారు. మోదీ ఫోటో లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎంపీలు రఘునందన్ రావు, అర్వింద్ లు డిమాండ్ చేశారు. సంగారెడ్డి సభలో ఏలాంటి గొడవలు రేగినా మాకు సంబంధం లేదంటూ పరోక్షంగా హెచ్చరించారు.
Smart Ration Cards for Welfare of Every Family
మన ప్రజా ప్రభుత్వంలో సామాన్యుల సంక్షేమమే లక్ష్యంగా,
సరికొత్తగా “స్మార్ట్ రేషన్ కార్డులు”
🌾 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు
👨👩👧👦 3.41 కోట్ల మంది లబ్ధిదారులు
🍚 ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యంప్రగతి పథం.. సకల జనహితం..
మన… pic.twitter.com/oY2DxBPcCc— Congress for Telangana (@Congress4TS) August 14, 2026